Begin typing your search above and press return to search.

మోదీ భేటీ యుద్ధ శంఖారావమేనా?

By:  Tupaki Desk   |   25 Sep 2016 4:20 AM GMT
మోదీ భేటీ యుద్ధ శంఖారావమేనా?
X
ఉరీలో పాకిస్తాన్‌ దాదాపు అధికారికంగా ఉగ్రవాద దాడులకు తెగబడింది. దీనిని యావత్‌ భారతదేశం గర్హిస్తోంది. అయితే ఈ పాక్‌ ఉగ్ర దాడులకు భారత్‌ ఎలా ప్రతిస్పందించబోతోంది. ఇది ప్రస్తుతం చాలా ఆసక్తికరమైన అంశం. దాడుల తర్వాత కూడా రెచ్చగొట్టే ప్రకటనలతోనే పాక్‌ ప్రధాని షరీఫ్‌ మాట్లాడుతుండగా.. భారత ప్రధాని మోదీ.. తన పాలనలోని సాహసాన్ని నిరూపించుకోవడానికి ఏం చేయబోతున్నారు అనేది కీలకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అయితే ఉరీ దాడుల అనంతర పరిణామాల గురించి చర్చించడానికి ప్రధాని మోదీ.. త్రివిధ దళాధిపతులతో ఈ సందర్భంగా సమావేశం అయ్యారు. ఉరీ అనంతరం పాకిస్తాన్‌ తో వ్యవహరించాల్సిన తీరు గురించి మోదీ నిర్వహించిన సమావేశంలో విదేశాంగ శాఖ అధికారులు గానీ, రాయబార అధికారులు గానీ లేకుండా.. సైనిక అధికారులు మాత్రమే ఉండడంతో ఇప్పుడు జనానికి కొత్త సంకేతాలు అందుతున్నాయి.

పాకిస్తాన్‌ మీద యుద్ధం చేయడానికి మోదీ సర్కారు సిద్ధమవుతున్నదా? అని అంతా అనుకుంటున్నారు. గతంలో ఇందిరాగాంధీ కూడా ఇలాగే త్రివిధ దళాల అధికారులతో సమావేశాలు పెట్టుకుని, వారితో కూలంకషంగా చర్చించి పాకిస్తాన్‌ మీద యుద్దానికి భేరీ మోగించిన సంగతిని పలువురు గుర్తు చేస్తున్నారు. ప్రధాని నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఇతర శాఖల వారికి ప్రాధాన్యం లేకుండా సైనికాధికారులు మాత్రమే ఉండడంతో యుద్ధ భేరీలు మోగుతాయా అని పలువురు అనుకుంటున్నారు.