Begin typing your search above and press return to search.

తాజ్‌ మ‌హ‌ల్‌ అమ్మ‌కానికి...మోదీ రెడీ!

By:  Tupaki Desk   |   5 Feb 2020 5:10 AM GMT
తాజ్‌ మ‌హ‌ల్‌ అమ్మ‌కానికి...మోదీ రెడీ!
X
ఢిల్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాట‌ల తూటాలు పేలుతున్నాయి. పోలింగ్ తేదీ స‌మీపిస్తున్న కొద్దీ...విమ‌ర్శ‌లు దూకుడు పెరుగుతున్నాయి. జంగ్‌ పురాలో ప్రచార సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీపై టార్గెట్‌ గా విమర్శలకు దిగారు. నరేంద్ర మోడీ ఆగ్రాలోని తాజ్‌ మహల్‌ ని కూడా అమ్మేస్తారేమోనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇండియన్ ఆయిల్ - ఎయిరిండియా - హిందుస్థాన్ పెట్రోలియం - రైల్వేస్ - ఆఖరికి ఎర్రకోట ఇలా ప్రతిదీ అమ్ముకుంటూ పోతున్నారని అన్నారు. భవిష్యత్తులో మోడీ తాజ్‌ మహల్‌ ని కూడా అమ్మేస్తారేమోనని ఆయ‌న వ్యాఖ్యానించారు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక హింసను రెచ్చగొట్టడం తప్ప అభివృద్ధి చేసింది లేద‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ దేశంలో హింసను రెచ్చగొడ్డమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ఏ ఒక్క మత గంధం కూడా హింసను ప్రోత్సాహించదని - మోడీకి అసలు ఏ మతం గురించీ అవగాహన లేదని రాహుల్ అన్నారు. మేకిన్ ఇండియా అంటూ ప్రధాని మోడీ చాలా మంచి నినాదాన్ని అందించారని రాహుల్ గాంధీ అన్నారు. అయితే ఆ స్లోగన్‌ కు తగ్గట్టుగా యూపీలోని ఆగ్రాలో ఒక్క ఫ్యాక్టరీ కూడా పెట్టలేదని చెప్పారు.

ఇదిలాఉండ‌గా - కాంగ్రెస్‌ కు కీల‌క స‌మ‌యంలో షాక్ త‌గిలింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జనార్దన్‌ ద్వివేది కుమారుడు సమీర్‌ ద్వివేది బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ సమక్షంలో సమీర్‌ ద్వివేది కాషాయ కండువా కప్పుకున్నారు. నేను మొదటిసారిగా రాజకీయ పార్టీలో చేరుతున్నా. ప్రధాని నరేంద్రమోదీ చేపడుతున్న కార్యక్రమాలు నన్ను ఎంతో ఆకర్షించాయి. అందువల్లే బీజేపీలో చేరుతున్నానన్నారు.