Begin typing your search above and press return to search.

ఏపీ ఫైలు మీద సంతకం పెట్టకుండా ఫోన్లు చేస్తే ప్రయోజనం ఏంది మోడీ?

By:  Tupaki Desk   |   6 April 2020 5:10 AM GMT
ఏపీ ఫైలు మీద సంతకం పెట్టకుండా ఫోన్లు చేస్తే ప్రయోజనం ఏంది మోడీ?
X
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించే సాహసం చేయటానికి ఎవరికి ఇష్టముండదు. దేశ ప్రజలు ఆయన్ను.. ఆయన మాటలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారన్న విషయం ఆదివారం రాత్రి సరిగ్గా తొమ్మిది గంటల వేళలో యావద్దేశం తమ చేతలతో చెప్పేసింది. తానేం చెబితే చేసే దేశ ప్రజల స్పందన చూసిన తర్వాత.. మోడీ మాష్టారు ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

విపత్కర పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రాలకు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కోరిన సాయాన్ని అందించే విషయంలో పినాసితనాన్ని ప్రదర్శించే మోడీ.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాత్రం అదే పనిగా ఫోన్ చేయటం మాత్రం కనిపిస్తుంది. కరోనావేళ.. ఏపీ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్న విషయం అందరికి తెలిసిందే. ఇలాంటివేళ.. కేంద్రం నుంచి విడుదల కావాల్సిన నిధుల్ని రిలీజ్ చేస్తే బాగుంటుంది. కానీ.. మోడీ మాస్టారు మాత్రం అలాంటివేమీ చేయరు. అదే సమయంలో తానేమీ చేయట్లేదన్న భావన కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ముఖ్య మంత్రులకు ఫోన్ చేయటం కనిపిస్తుంది.

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోడీ ఫోన్ చేశారు. కరోనా వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో ఏపీలో పెరుగుతున్న కేసుల గురించి ప్రధాని ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా కరోనాను కంట్రోల్ చేసేందుకు రాష్ట్ర సర్కారు తీసుకున్న చర్యల్ని ప్రదానికి వివరించారు. అదే సమయంలో ఏపీ ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల గురించి ప్రస్తావించటమే కాదు.. కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ.5వేల కోట్లకు సంబంధించిన నిధుల ప్రస్తావన చేశారు. తాను చెప్పిన విషయాల్ని ఇప్పటికే లేఖ రూపంలో పంపిన వైనాన్ని మోడీకి గుర్తు చేశారు జగన్.

లేఖ లోని అంశాలు ఇప్పటికే తన దృష్టికి వచ్చాయని.. చర్యలు తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రికి ప్రధాని చెప్పటం గమనార్హం. ప్రధాని లాంటి వ్యక్తి ఫోన్ చేయొద్దని చెప్పం. కానీ.. ఫోన్ కాల్ కంటే కూడా.. నిధుల్ని విడుదల ఫైల్ మీద సంతకం చేస్తే సరిపోతుంది కదా? ఫోన్ చేసేందుకు ఉండే సమయం.. ఫైల్ మీద సంతకం పెట్టే విషయంలో ఎందుకుండదంటారు?