Begin typing your search above and press return to search.

తనను తిట్టేస్తున్న కేసీఆర్ కు మోడీ ఫోన్లో విషెస్ చెప్పటమా?

By:  Tupaki Desk   |   20 Feb 2022 8:30 AM GMT
తనను తిట్టేస్తున్న కేసీఆర్ కు మోడీ ఫోన్లో విషెస్ చెప్పటమా?
X
ఒక సాదాసీదా వ్యక్తి.. ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేని నేత.. ఏకంగా దేశ ప్రధాని అవుతారా? అసలు సాధ్యమా? అందులోనూ భారతదేశం లాంటి విలక్షణ దేశం.. విపరీత రాజకీయ వైరుధ్యాలు ఉన్న చోటు పీఎం కుర్చీలో కూర్చోవటం అంత తేలికైన విషయం కాదు.

కానీ.. క్రమబద్ధంగా వ్యవహరిస్తూ ముందుకెళితే అదేమీ అసాధ్యమైన విషయం కాదన్నది నరేంద్ర మోడీ ఎపిసోడ్ వేళ.. అందరికి అర్థమవుతోంది. ఇక..ఇప్పటివరకు ప్రధాన మంత్రులుగా బాధ్యత నిర్వహించిన వారితో పోలిస్తే మోడీ తీరు భిన్నమైనది. ఆయన ఎప్పుడైనా హర్ట్ అయితే.. దాన్ని ఒక పట్టాన మర్చిపోరు.

తనను మాట అన్న వారిని ఏళ్ల తర్వాత అయినా సరే.. వారికి పాఠం చెప్పే వరకు వదిలిపెట్టారు. ఇప్పటివరకు ఇదే తీరును ప్రదర్శిస్తున్న మోడీని.. కొన్నేళ్ల క్రితం చంద్రబాబు తనను ఉద్దేశించి చేసిన ఘాటు విమర్శలు..గోద్రా ఎపిసోడ్ లో తనను వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు పెట్టుకొని.. అందుకు బదులు తీర్చుకోవటం తెలిసిందే.

అవసరం కోసం మిత్రుడిగా వ్యవహరిస్తున్నట్లుగా చెబుతూనే.. తనకు అవకాశం చిక్కినంతనే తన అధిక్యతను ప్రదర్శించటమే కాదు.. చంద్రబాబుపై బదులు తీర్చుకున్న తీరును మర్చిపోలేం.

అలాంటిది తాజాగా ప్రధాని మోడీని ఉద్దేశించి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తక్కువేం కావు. దేశం నుంచి తరిమికొడతామన్న తీవ్రమైన వ్యాఖ్యల్ని చేశారు. ఇటీవల కాలంలో తనను మరే ముఖ్యమంత్రి కూడా అనని మాటల్ని అనటమే కాదు..తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన వైనాన్ని మర్చిపోయే అవకాశం లేదనే చెప్పాలి.

ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలకం కావటం.. యూపీ ఫలితం మీదనే ఆ పార్టీ తన శక్తియుక్తుల్ని.. వనరుల్ని ఫోకస్ చేసిందన్న సంగతి తెలిసిందే.

ఒకవేళ యూపీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితం బీజేపీకి ఎదురైతే పరిస్థితి మరోలా ఉంటుందని.. ఒకవేళ అందుకు భిన్నంగా సానుకూల ఫలితం వెలువడితే మాత్రం.. కేసీఆర్ ను ఊరికే వదిలిపెట్టే అవకాశం లేదంటున్నారు. దీని కోసమే.. తనను అనరాని మాటల్ని అంటున్నా.. వాటికి అస్సలు స్పందించని మోడీ.. మొన్న కేసీఆర్ పుట్టినరోజున ఫోన్ చేసి మరీ విషెస్ చెప్పిన తీరు ఆసక్తికరంగా మారింది.

భవిష్యత్తులో తాను తీసుకునే నిర్ణయాలకు ఎలాంటి వంక పెట్టకుండా ఉండటానికి.. విమర్శల వేళలోనూ ఫోన్ చేసి విషెస్ చెప్పటం ద్వారా.. తనలోని వ్యక్తిత్వ వికాస నిపుణుడి కోణాన్ని మోడీ ప్రదర్శించారని చెబుతున్నారు.

నిజానికి మోడీతో కేసీఆర్ స్నేహ సంబంధాన్నే కోరుకున్నట్లుగా చెబుతారు. అదే సమయంలో కేసీఆర్ తో మిత్రత్వాన్నే మోడీషాలు కోరుకున్నారని చెబుతారు. తన కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయటానికి సహకారం అందించాలని కేంద్రంలోని బీజేపీ పెద్దల్ని ఆర్థించినట్లుగా చెబుతారు.

అయితే.. దుబ్బాక.. గ్రేటర్ హైదరాబాద్.. హుజూరాబాద్ ఉప ెన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత కేసీఆర్ మనసు కీడును శంకించినట్లు చెబుతారు. దీంతో.. బీజేపీ మీద యుద్ధం ప్రకటించారని చెబుతారు.

తనను నోటికొచ్చినట్లుగా కేసీఆర్ తిట్టేయటం.. తాను సమతా విగ్రహావిష్కరణకు వస్తే డుమ్మా కొట్టటం.. లెక్క చేయకుండా మాట్లాడిన మాటల వివరాలు.. ఫీడ్ బ్యాక్ మోడీకి ఎప్పుడో చేరిపోయినట్లు చెబుతారు. తదనంతర చర్యలు కాలానుగుణంగా ఉంటాయని చెబుతున్నారు.

మిగిలిన వారి మాదిరి మోటుగా కాకుండా తెలివిగా దెబ్బ తీసే అలవాటున్న మోడీ.. కేసీఆరర్ విషయంలోనూ విడిచిపెట్టరన్న మాట వినిపిస్తోంది. మరీ వాదనలో వాస్తవం ఏమిటన్నది కాలమే సరైన సమాధానం ఇవ్వగలదు.