Begin typing your search above and press return to search.

మోడీ గ్రాఫ్ ను కరోనా ఎంతలా పెంచేసిందంటే?

By:  Tupaki Desk   |   1 May 2020 3:45 AM GMT
మోడీ గ్రాఫ్ ను కరోనా ఎంతలా పెంచేసిందంటే?
X
ప్రతి సంక్షోభం కొత్త అవకాశాల్ని ఇస్తుందని ఊరికే అనలేదేమో! కరోనా వైరస్ విరుచుకుపడటానికి కాస్త ముందు దేశంలో ప్రధాని మోడీ రాజకీయంగా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది గడిచిన రెండు నెలల్లో రాజకీయంగా ఆయన గ్రాఫ్ ఊహించనంత ఎత్తుకు ఎదిగిపోవటమే కాదు.. గడిచిన కొన్నేళ్లలో మరే ప్రధాని పొందనంత ప్రజా మద్దతును మోడీ సొంతం చేసుకున్నారని చెప్పక తప్పదు. కరోనాను కట్టడి చేయటంలో ప్రధాని మోడీ సఫలం కావటమే కాదు.. ఆయన స్పందించిన తీరుకు భారతావని జైజేలు కొడుతోంది.

కరోనా నేపథ్యంలో మోడీ ఇమేజ్ గ్రాఫ్ భారీగా పెరిగిన విషయాన్ని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ వెల్లడిచింది. జనవరి ఏడున ప్రజల్లో మోడీ ఆమోదయోగ్యత రేటు 76 శాతం కాస్తా ఏప్రిల్ 21 నాటికి ఏకంగా 83 శాతానికి పెరిగినట్లుగా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. కరోనా వేళ మోడీ ఇమేజ్ ఎంత పెరిగిందన్న విషయం మీద ఐఏఎన్ఎస్ - సీవోటర్ సైతం ప్రత్యేక సర్వే నిర్వహించింది.

కరోనా వేళ మోడీ నాయకత్వం పై నమ్మకం దేశ ప్రజల్లో భారీగా పెరిగినట్లు గుర్తించారు. మార్చి 25న 76.8 శాతంగా ఉన్న నమ్మకం ఏప్రిల్ 21 నాటికి ఏకంగా 93.5 శాతంగా పెరగటం గమనార్హం. కరోనా వైరస్ దేశానికి వచ్చిన సమయంలో ఆర్థిక మందగమనం.. ఢిల్లీ అల్లర్లు.. పౌరసత్వ చట్టం లాంటి అంశాలతో మోడీ సర్కారు తలబొప్పి కట్టి.. ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి. ఇలాంటివేళ.. కరోనాపై యుద్ధంలో మోడీ సర్కారు వ్యవహరించిన తీరు ఆయన ఇమేజ్ గ్రాఫ్ ను భారీగా పెంచేసింది.

కరోనాపై భారత్ యుద్ధం కారణంగా కేంద్రం అనుసరించిన విధానాలకు భారీగా మైలేజీ సొంతం చేసుకున్నట్లుగా తేల్చారు. కరోనా ముందు వరకూ ఉన్న తలనొప్పులన్ని ఇప్పుడు వెనక్కి వెళ్లిపోయాయి. విదేశాలకు హైడ్రాక్సిక్లోరోక్విన్ లాంటి మందుల్ని పంపి సాయం చేయటం ద్వారా ఆయన ఇమేజ్ ప్రపంచ నేతగా పెరిగేలా చేసింది. కరోనా కారణంగా కోట్లాది మంది అవస్థలు పడుతున్న వేళ.. అందుకు భిన్నంగా ప్రధాని మోడీ ఇమేజ్ ప్రజల్లో భారీగా పెరిగేలా చేసింది.