Begin typing your search above and press return to search.

ఏపీ ప్యాకేజీ చట్ట‌బ‌ద్ద‌త‌కు నో చెప్పిన ప్ర‌ధాని

By:  Tupaki Desk   |   23 Feb 2017 4:35 AM GMT
ఏపీ ప్యాకేజీ చట్ట‌బ‌ద్ద‌త‌కు నో చెప్పిన ప్ర‌ధాని
X
ఆంధ్రుల మ‌నోభావాల‌ను ఒకింత తీవ్రంగానే క‌ల‌చివేసే వార్త ఇది. విడిపోయిన రాష్ర్టాన్ని ప్ర‌త్యేక హోదాతో భ‌రోసాగా నిలుస్తామ‌ని హామీ ఇచ్చిన బీజేపీ అనంత‌రం ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కిన త‌ర్వాత ఆ విష‌యాన్ని లైట్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆంధ్రుల ఆకాంక్ష‌గా ప్ర‌త్యేక హోదా మారిన నేప‌థ్యంలో వారికి ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా ఏపీకి హామీ ఇచ్చిన ప్ర‌త్యేక హోదాకు బ‌దులుగా ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించింది. అయితే ఇంత‌టి కీల‌క‌మైన ప్యాకేజీకి చట్టబద్ధత క‌ల్పించే విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం మీన‌మేషాలు లెక్కిస్తోంది. తాజాగా జ‌రిగిన కేంద్ర‌ మంత్రివర్గ సమావేశంలో ఈ విష‌యాన్నిచ‌ర్చించారు. అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా వేయ‌డం గ‌మ‌నార్హం. దీంతో వచ్చే నెల 9 నుంచి జరిగే మలివిడత బడ్జెట్‌ సమావేశాల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశమేలేదు. దీనిపై ఇప్పుడు చర్చించలేమని, తదుపరి సమావేశంలో చూద్దామని ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ప్యాకేజీ చట్టబద్ధత అంశం గత కేబినెట్ స‌మావేశాల్లో కూడా వాయిదా వేయ‌డం గ‌మ‌నార్హం.

ప్యాకేజీకి చట్టబద్ధత అంశాన్ని నాన్చడమే కేంద్ర ప్రభుత్వ విధానంగా ఉంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఏ రాష్ట్రానికీ ఇవ్వని ప్యాకేజీ ఏపీకి ఇచ్చారని, దీనికి చట్ట బద్ధత సాధిస్తామని, ఇక ప్రత్యేక హోదా అవసరమే లేదని మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు ఇన్నాళ్లు దబాయిస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో ప్యాకేజీకి చట్టబద్ధత గురించి పలువురు ఎంపీిలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయినా దీనిపై కేంద్రం స్పందించలేదు. ప్యాకేజీ చట్ట బద్ధతకు సంబంధించి నోట్‌ తయారవుతోందని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని సమాధానమిచ్చారు. అంతే తప్ప నిర్దిష్ట గడువు ఏదీ వెల్లడించలేదు. ప్యాకేజీ చట్టబద్ధతపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. రాష్ట్రానికి చెందిన సుజనా చౌదరి - అశోక్‌ గజపతిరాజు వంటివారు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నా ఫలితం లేకపోయింద‌నే భావ‌న వినిపిస్తోంది. చట్టబద్ధత అంశాన్ని వేగవంతం చేయాలని విజ్ఞప్తులకే వారు పరిమితమయ్యారు. ఈనెల 15న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ప్యాకేజీకి చట్టబద్ధతపై నిర్ణయం వెలువడనున్నట్లు ప్రచారం జరిగింది. నోట్‌పై కొన్ని మంత్రిత్వ శాఖల పరిశీలన పూర్తి కాకపోవడం వల్లే దీనిని వాయిదా వేశారని లీకు వార్తలు తెలియజేస్తున్నాయి. బుధవారం నాటి మంత్రివర్గ సమావేశం మూడు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌కు కీలకమైన ఈ ప్యాకేజీ చట్టబద్ధత అంశాన్ని మాత్రం వాయిదా వేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/