Begin typing your search above and press return to search.

భార‌త్‌కు జీ-20 ప‌గ్గాలు.. మోడీ గ్రేటే!!

By:  Tupaki Desk   |   16 Nov 2022 4:41 PM GMT
భార‌త్‌కు జీ-20 ప‌గ్గాలు.. మోడీ గ్రేటే!!
X
ఔను..! ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. ఇది ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విజ‌య‌మే. రాజ‌కీయ వైరాల‌ను సైతంప‌క్క‌న పెట్టి కాంగ్రెస్‌లోని చాలా మంది నాయ‌కులు స్వాగ‌తిస్తున్న ప‌రిణామం కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. సుదీర్ఘ కాలంగా భార‌త్ ఎదురు చూస్తున్న జీ-20 దేశాల‌కు నాయ‌క‌త్వం వ‌హించే బాధ్య‌త‌లు ఎట్ట‌కేల‌కు ప్ర‌ధాని మోడీ నేతృత్వంలో భార‌త్‌కు ద‌క్కాయి. ఇలా ద‌క్క‌డం 75 ఏళ్ల భార‌త స్వ‌తంత్ర చ‌రిత్ర‌లో ఇదే ప్రథ‌మం. అభివృద్ది చెందిన‌, చెందుతున్న 20 అతి పెద్ద దేశాల కూట‌మికి అధ్య‌క్ష‌త వ‌హించే సువ‌ర్ణ అవ‌కాశాన్ని భార‌త్ ద‌క్కించుకుంది.

2023లో నిర్వహించనున్న జీ-20 18వ శిఖరాగ్ర సదస్సు బాధ్యతలను ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడో.. ప్రధాని నరేంద్ర మోడీకి తాజాగా అధికారికంగా అప్పగించారు. దీంతో ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి జీ-20 అధ్యక్ష బాధ్యతలు భారత్ చేపట్టనుంది. వచ్చే ఏడాది జరిగే సమావేశాలకు భారత్ నేతృత్వం వహించనుంది. ఈ మేరకు ప్రస్తుత జీ-20 సమావేశాల ముగింపు కార్యక్రమంలో ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడో.. సదస్సు బాధ్యతలను భారత్కు అప్పగించారు.

``ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు`` అనే నినాదంతో.. వసుధైక కుటుంబం అనే భావనతో 2023లో జీ20 సదస్సును నిర్వహిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఈ సంద‌ర్భంగా అత్యంత ఉల్సాస భ‌రిత వాతావ‌ర‌ణంలో ప్ర‌క‌టించారు. జీ-20 అధ్యక్ష పదవిని చేపట్టడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్న మోడీ.. దేశంలోని వివిధ నగరాల్లో సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. జీ-20 సదస్సును ప్రపంచ మార్పునకు ఉత్ప్రేరకంగా మారుస్తామని ప్రధాని వెల్లడించారు. ఇప్పటికే జీ20 సదస్సుకు సంబంధించిన పనులు భార‌త్‌ ప్రారంభించింది. వచ్చే ఏడాది నిర్వహించనున్న సమావేశాల కోసం వెబ్సైట్, లోగో, నినాదాల‌ను కూడా ఇటీవ‌ల మోడీ ఆవిష్క‌రించారు.

ఏమిటీ జీ-20

అంతర్జాతీయ వేదికలపై జీ-2, జీ-4, జీ-7, జీ-10, జీ-15, జీ-20 వంటి పేర్లు తరచూ వినిపిస్తుంటాయి. వీటిల్లో అత్యంత శక్తిమంతమైంది జీ-20 గ్రూపు. ఇది ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులకు.. ప్రపంచ జీడీపీలో 85శాతం వాటాకు.. అంతర్జాతీయ వాణిజ్యంలో 75శాతానికి.. ప్రాతినిధ్యం వ‌హిస్తుంది. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలు మొత్తం మనకు ఈ వేదికపైనే కనిపిస్తాయి. ఇక్కడ తీసుకొనే నిర్ణయాలు.. ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి.

1997లో ఆసియాలో ఆర్థిక సంక్షోభం తలెత్తిన తర్వాత ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశాలన్నీ కలిసి గ్రూపు ఏర్పాటు చేయాలని భావించాయి. దీంతో 1999 బెర్లిన్‌లో తొలిసారి జీ20 సదస్సును నిర్వహించారు. వాస్తవానికి జీ20 ప్రధాన కార్యాలయం వంటిది ఏమీ లేదు. ఏ దేశంలో సదస్సు నిర్వహిస్తారో ఆ దేశమే ఏర్పాట్లు చూసుకొంటుంది. ఆ దేశమే అధ్యక్షత వహిస్తుంది. ఈ అధ్యక్ష ఎన్నిక కోసం జీ20ని ఐదు గ్రూపులుగా విభజించారు. గ్రూపులు వారీగా అధ్యక్ష బాధ్యతలు అందుతాయి. ఆ గ్రూప్‌లో ఓటింగ్‌ నిర్వహించి ఎంపిక చేస్తారు.

జీ- 20 దేశాలు ఇవే..

అర్జెంటీనా, బ్రెజిల్, చైనా, జర్మనీ, ఇండోనేషియా, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్సు, భారత దేశం, ఇటలీ, మెక్సికో, దక్షిణ, కొరియా, రష్యా, టర్కీ, అమెరికా, దక్షిణ ఆఫ్రికా, సౌదీ అరేబియా, బ్రిట‌న్‌, యూరోపియన్ యూనియన్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.