Begin typing your search above and press return to search.

మే 3 తర్వాత పరిస్థితి ఏంటి .. ప్రధాని మోదీ కీలక భేటీ !

By:  Tupaki Desk   |   1 May 2020 9:30 AM GMT
మే 3 తర్వాత పరిస్థితి ఏంటి .. ప్రధాని మోదీ కీలక భేటీ !
X
కరోనా వైరస్‌ కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌ డౌన్‌ మే 3తో ముగియబోతుంది. తొలి విడత లాక్‌ డౌన్ ఏప్రిల్ 24నుంచి ఏప్రిల్ 14 వరకూ కొనసాగింది. రెండో దశ మే 3 వరకూ కొనసాగనుంది. అయితే , లాక్ డౌన్ రెండో దశ గడువు మరో రెండు రోజుల్లో ముగియబోతున్న నేపథ్యంలో ..ఆ తరువాత అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని నరేంద్రమోదీ కీలక సమాలోచనలు జరుపుతున్నారు.

లాక్‌ డౌన్ ‌ను మరోసారి పొడిగిస్తారా.. లేక ఆంక్షలను సడలిస్తారా అనేది కేంద్ర ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఆయన నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా - రాజ్‌ నాథ్‌ సింగ్‌ భేటీతో అయ్యారు. ఈ ప్రధాన భేటీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ - పీయుష్‌ గోయల్‌ తో పాటు కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గాబా - సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ కూడా పాల్గొన్నారు. లాక్‌ డౌన్‌ పై అనుసరించాల్సిన వ్యూహాలు - కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రముఖం గా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే రెడ్ - ఆరెంజ్ - గ్రీన్ జోన్లపై స్పష్టత ఇచ్చిన కేంద్రం... లాక్ డౌన్‌ ఎత్తివేత లేదా మినహాయింపులపై ఎలాంటి ప్రకటన చేస్తుందన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు కరోనాపై జరుగుతున్న పోరులో మే నెల అత్యంత కీలకమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అలాగే ప్రధాని తాజాగా సీఎం లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సమయంలో మెజారిటీ రాష్ట్రాల సీఎంలు లాక్ డౌన్ ను పొడగించాలని కోరారు. పంజాబ్ అయితే ఏకంగా మే 17 వరకూ లాక్‌ డౌన్ పొడిగించింది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ..లాక్‌ డౌన్ కొనసాగించే ఉద్దేశం తోటే వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే తెలంగాణ నుంచి జార్ఖండ్‌ కు 12 వందల మందితో ప్రత్యేక రైలు బయలుదేరింది. మిగతా రాష్ట్రాలు కూడా రైళ్లు లేదా బస్సుల ద్వారా తమ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను పిలిపించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఈ ప్రసంగంలోనే లాక్ ‌డౌన్ కొనసాగింపు పై ప్రధాని నిర్ణయం ప్రకటిస్తారని భావిస్తున్నారు. అదే సమయంలో కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.