Begin typing your search above and press return to search.

అమిత్‌ షా మాట: దేశాన్ని మోడీ అమ్మేస్తాడు

By:  Tupaki Desk   |   30 March 2018 5:46 AM GMT
అమిత్‌ షా మాట: దేశాన్ని మోడీ అమ్మేస్తాడు
X
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ నేత‌ల‌కు అనూహ్యమైన చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్కారు విసిరిన లింగాయత్‌ ల‌కు మైనార్టీ హోదా అనే అంశం ఇప్ప‌టికే బీజేపీని ఇరకాటంలో పెడుతుండ‌గా...మరోవైపు అంతకన్నా ముఖ్యంగా హిందీ నుంచి కన్నడ అనువాదం చేసే వారితో బీజేపీకి తలనొప్పిగా మారుతోంది. తాజాగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా మాట‌ల‌కు చేసిన అనువాదం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. 'అవినీతిలో పోటీ పెడితే అందులో యడ్యూరప్ప ప్రభుత్వమే నెంబర్‌ వన్‌గా ఉంటుంద'ని హిందీలోనే అని ఆ తర్వాత నాలుక్కర్చుకున్న విషయం విదితమే. దానికి కొన‌సాగింపుగా అన్న‌ట్లుగా తాజాగా మోడీ దేశాన్ని నాశ‌నం చేస్తార‌ని అమిత్ షా అన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

కర్నాటకలో దేవనాగరి జిల్లాలోని చిల్కరీ పట్టణంలో గురువారం నిర్వహించిన ర్యాలీలో అమిత్‌ షా మాట్లాడారు. అమిత్‌ షా హిందీలో చేసిన ఉపన్యాసాన్ని కన్నడభాషలోకి.. బీజేపీ ఎంపీ ప్రహ్లాద్‌ జోషి అనువ‌దించారు. అయితే ఇది సక్రమంగా అనువదించకపోవడంతో అధికారపక్షంపై బాణం విసిరితే..అనువాదంలో జరిగిన తప్పిదంలో మోడీనే రివర్స్‌ గా టార్గెట్‌ చేయటం విశేషం. 'పేదలు - దళితులు - వెనుకబడిన వర్గాలకు మోడీ చేయూతనివ్వరు. దేశాన్ని ఆయన సర్వనాశనం చేస్తారు. మీరంతా మోడీకే ఓటువేయాలి` అని అన్నట్టుగా ఈ అనువాదం సాగింది. ఈ ప‌రిణామం బీజేపీ వర్గాల్లో కలకలంరేపుతోంది. ఎంపీ ప్రహ్లాద్‌ కు హిందీ భాష అర్థం కాలేదా..లేక కావాలంటే అమిత్‌ షాను ఇరకాటంలో పెట్టడానికే ఇలా అనువదించాడా అనే కోణంలో కూడా చ‌ర్చ జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. ఒక‌వేళ అమిత్‌ షా స్వ‌యంగా ఇలా అంటే... అమిత్‌ షా ఉపన్యాసంలో ఈ రకమైన తప్పులు దొర్లడం ఇది మొదటి సారి కాదని అంటూ ఇటీవ‌లే య‌డ్యుర‌ప్పపై చేసిన కామెంట్ల‌ను ప్ర‌స్తావిస్తున్నారు.

ఇదిలాఉండ‌గా... కర్నాటక ఎన్నికలు ఎక్కడ భస్మాసురహస్తంలా తమ ప్రచారం ఎక్కడ కొంపముంచుతుందోనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఉత్తరభారత బీజేపీ నేతలకు దక్షిణభారత ఎన్నికల ప్రచారంలో భాషాపరమైన కష్టాలు అధిగమించలేకపోతున్నామని హస్తినలో అధిష్టానం తర్జనభర్జనపడుతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మోడీ, యోగితో పాటు పలువురు ఎన్నికల ప్రచారాలకు వచ్చినపుడు కూడా అనువాద సమస్య భయపెడుతోంద‌ని..ఇది ఎన్నికల్లో పుట్టి ముంచుతుందా అనే సందేహం వ్య‌క్తం చేస్తున్నారు.