Begin typing your search above and press return to search.

మోడీ కళ్లలో మెరుపుల కోసం...వైసీపీ ఏం చేస్తోందంటే....?

By:  Tupaki Desk   |   31 Oct 2022 5:30 PM GMT
మోడీ కళ్లలో మెరుపుల కోసం...వైసీపీ ఏం చేస్తోందంటే....?
X
ఆయన దేశానికి ప్రధాని. సర్వ శక్తిమంతుడు. ఆయనతో జట్టు కట్టడానికి ఏపీలోని ప్రధాన పార్టీలు అన్నీ కూడా తంటాలు పడుతున్న విషయం విధితమే. ఇదిలా ఉండగా మోడీ దాదాపుగా ఏడేళ్ళ తరువాత అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల కోసం వస్తున్నారు. ఆయన విశాఖ కేంద్రంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దాంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వైసీపీ అపుడే తన ప్రయత్నాలు మొదలెట్టింది అని అంటున్నారు.

ఈ నెల 12న ప్రధాని మోడీ విశాఖలో రైల్వే జోన్ ప్రధాన ఆఫీస్ కి శంకుస్థాపన చేస్తారు. అలాగే నాలుగు వందల కోట్లతో రైవే స్టేషన్ అధునీకరణ పనులను ఆయన ప్రారంభిస్తారు. దీంతో పాటుగా భీమిలీ నియోజకవర్గంలో ఐఐఎం భవనాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇంకా భోగాపురం ఎయిర్ పోర్టు, విజయనగరంలోని కేంద్రీయ విశ్వ విద్యాలయం భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో కూడా మోడీ పాల్గొంటారు అని అంటున్నారు. కానీ చూడాలి.

ఏది ఏమైనా వేల కోట్ల రూపాయాల అభివృద్ధి పనులు మోడీ చేతుల మీదుగా విశాఖలో ప్రారంభం కాబోతున్నాయి. దాంతో పాటు విశాఖ వాసుల చిరకాల కోరిక అయిన రైల్వే జోన్ కి మోడీ శంకుస్థాపన చేయడం అంటే పొలిటికల్ గా అది మైలేజ్ ని ఇచ్చే అంశం. దాంతో మోడీ విశాఖ సభను తమకు అనుకూలంగా చేసుకోవడానికి వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.

నవంబర్ 12న మోడీ విశాఖ ఏయూలోని పాతిక ఎకరాల స్థలంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి జగన్ సైతం ఆ సభలో పాలుపంచుకుంటారు. దాంతో మోడీ సభను పూర్తిగా వాడుకోవడానికి వైసీపీ రెడీ అయింది అంటున్నారు. ఈ సభకు కనీ వినీ ఎరుగని తీరున మూడు లక్షలకు పైగా జనాలతో నిర్వహించడానికి వైసీపీ అన్ని ఏర్పాట్లూ చేసుకుంటోంది.

ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అధినాయకత్వం విశాఖ పంపించింది. ఆయన దగ్గర ఉండి జనసమీకరణతో పాటు ప్రధాని సభ ఏర్పాట్లు అన్నీ చూసుకోవాలని కోరినట్లుగా తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్రం ఒక వైపు ప్రైవేట్ పరం చేస్తోంది. దాంతో కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోతున్న తీరు మీద వైసీపీ మీద సహజంగానే జనాలకు వ్యతిరేకత ఏర్పడుతోంది. దాంతో దాన్ని తగ్గించుకోవడంతో పాటు రైల్వే జోన్ తెచ్చిన క్రెడిట్ ని తమ ఖాతాలో వేసుకోవడానికి వైసీపీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది అని అంటున్నారు.

అదే విధంగా మరో వైపు లక్షలాది మంది జనాలతో సభను నిర్వహించడం ద్వారా అ మోడీ కంట్లో మెరుపులు చూడాలని కూడా వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. జగన్ సీఎం అయ్యాక ఏపీలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ఈ స్థాయిలో ప్రారంభించలేదు, దాంతో ఫస్ట్ టైం వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు.

అయితే వైసీపీ చేస్తున్న ఈ ప్రయత్నాల పట్ల ఏపీ బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారని అంటున్నారు. ప్రధాని మోడీ రైల్వే జోన్ ఇస్తే దాన్ని తమ గొప్పగా వైసీపీ నేతలు ఎలా చెప్పుకుంటారని అంటున్నారు. దాంతో తామే జనసమీకరణ చేసి పొలిటికల్ మైలేజ్ ని తీసుకుంటామని అంటున్నారు. ఈ మేరకు కేంద్ర బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. అయితే ఏపీలో ప్రభుత్వం ఉన్నందు వల్ల వైసీపీ తమ మాట చలామణీ చేసుకుంటూ ప్రధాని సభలో తమ ఆర్భాటమే చూపించాలని పట్టుదలగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.