Begin typing your search above and press return to search.

మోడీ మా ప్రధాని - మీరెవరు: ఉగ్రదేశమంటూ పాక్ మంత్రికి కేజ్రీ వార్నింగ్

By:  Tupaki Desk   |   31 Jan 2020 4:35 PM GMT
మోడీ మా ప్రధాని - మీరెవరు: ఉగ్రదేశమంటూ పాక్ మంత్రికి కేజ్రీ వార్నింగ్
X
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ - ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి అండగా నిలిచారు! పాక్‌ కు చెందిన మంత్రి ఫవాద్ హుస్సేన్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ట్వీట్ చేసారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని - ఫిబ్రవరి 8న మరో రాష్ట్రాన్ని కోల్పోతామనే ఒత్తిడిలో ఆ పార్టీ ఉందని - కాశ్మీర్ - సీఏఏ - మందగమనం వంటి వివిధ కారణాల వల్ల మోడీ సహనం కోల్పోతున్నారని పాక్ మంత్రి విమర్శించారు.

దీనికి కేజ్రీవాల్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ ఎన్నికలు తమ అంతర్గత అంశమని - నరేంద్ర మోడీ మా ప్రధానమంత్రి అని - తమ దేశాధినేతను అంటే ఊరుకునేది లేదని పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్‌ ను హెచ్చరించారు. ఈ మేరకు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

'నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి. ఆయన మాకు కూడా ప్రధానమంత్రి. అలాగే ఢిల్లీ ఎన్నికలు భారత్ అంతర్గత అంశం. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లోకి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారు రావడాన్ని మేం ఎట్టి పరిస్థితుల్లోను సహించే ప్రసక్తి లేదు' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

పాకిస్తాన్ ఎంతగా ప్రయత్నించినా - భారత్‌ లోని ఐక్యతను మాత్రం దెబ్బతీయలేరని కూడా కేజ్రీవాల్ ధీటుగా స్పందించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాకిస్తాన్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత సైనిక దళాలు కేవలం ఏడు నుంచి పది రోజుల్లోనే పాకిస్తాన్‌ ను మట్టుపెట్టగలవని వ్యాఖ్యానించారు