Begin typing your search above and press return to search.

త‌న మార్క్ ను మ‌రోసారి ప్ర‌ద‌ర్శించిన మోడీ

By:  Tupaki Desk   |   24 May 2018 4:18 AM GMT
త‌న మార్క్ ను మ‌రోసారి ప్ర‌ద‌ర్శించిన మోడీ
X
ప్ర‌ధాని మోడీని త‌ర‌చూ దివంగ‌త మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీతో పోలుస్తుంటారు. వాస్త‌వానికి ఆ పోలిక‌లో అర్థం లేదు. ఎందుకంటే.. ఇందిర‌కు.. మోడీకి మ‌ధ్య సారూప్య‌త చాలా త‌క్కువ‌. చాలా త‌క్కువ విష‌యాల్లో వారి తీరు క‌లిసిన‌ట్లుగా క‌నిపిస్తుందే త‌ప్పించి.. త‌ర‌చి చూసినా.. ఆమె అలా వ్య‌వ‌హ‌రించ‌టానికి వెనుక కార‌ణాల్ని చూస్తే.. స‌హేతుకంగా క‌నిపిస్తుంటాయి. కానీ.. మోడీ విష‌యంలో అలా కాదు.

ఆ మాట‌కు వ‌స్తే.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల విష‌యంలో ఇందిర డీల్ చేసే ప‌ద్ధ‌తికి.. మోడీకి అస్స‌లు సంబంధం ఉండ‌దు. త‌న ప్ర‌త్య‌ర్థి అంటే బిర్ర బిగుసుకుపోవ‌టం ఇందిర‌మ్మ‌కు అల‌వాటు. కానీ.. మోడీ మాష్టారు అలా కాదు. ఆయ‌న ఏ అవ‌కాశాన్ని మిస్ చేసుకోవ‌టానికి ఇష్ట‌ప‌డ‌రు.

అధికారాన్ని చేజార్చుకోవ‌టానికి సుతరామూ ఇష్ట‌ప‌డ‌ని మోడీ.. అవ‌స‌ర‌మైతే త‌న‌ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌తో సైతం చేతులు క‌లిపేందుకు వెనుకాడ‌రు. తాజాగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు ఈ విష‌యాన్ని మ‌రోసారి రుజువు చేస్తుంద‌ని చెప్పాలి. క‌ర్ణాట‌క‌లో ఏం జ‌రిగిందో తెలిసిందే. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌ధాని హోదాలో ఉన్న మోడీ ఎంతగా విరుచుకుప‌డింది.. త‌న స్థాయిని మ‌రిచి మ‌రీ విమ‌ర్శ‌లు చేసింది తెలిసిందే.

ఒక రాష్ట్ర ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి ప్ర‌యోజ‌నం క‌ల్పించేందుకు ప్ర‌ధాని స్థానంలో ఉన్న ముఖ్య‌నేత ఒక‌రు త‌న స్థాయిని మ‌రిచిపోయి మ‌రీ విమ‌ర్శ‌నాస్త్ర‌ల్ని సంధించారు. ఫ‌లితాలు వచ్చాక కూడా ప‌వ‌ర్ ను చేజిక్కించుకోవ‌టానికి బ్యాక్ ఎండ్‌లో ఎలాంటి వ్యూహాన్ని న‌డిపార‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎప్పుడైతే త‌మ‌కు అవ‌స‌ర‌మైన 8 మంది ఎమ్మెల్యేల బేర‌సారాలు బ‌య‌టకు రావ‌టంతో మోడీ అలెర్ట్ అయ్యార‌ని చెబుతారు. ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మేజిక్ నెంబ‌రును స‌మ‌కూర్చుకునే విష‌యంలో య‌డ్డీ తాము వేసిన అంచ‌నాకు భిన్న‌మైన ప‌రిణామాలు చోటు చేసుకోవ‌టాన్ని చూసిన వారు వెన‌క్కి త‌గ్గారు.

యడ్డీ రాజీనామాకు ఒక రోజు ముందు నుంచీ మోడీషాలు మౌనాన్ని ఆశ్ర‌యించారు. అలాంటి మోడీ.. తాజాగా క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి ప్ర‌మాణ‌స్వీకారం చేసిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు ఫోన్ చేశారు. బుధ‌వారం సాయంత్రం ప్ర‌ధానే స్వ‌యంగా ఫోన్ చేయ‌టం.. కుమార‌స్వామి ప్ర‌భుత్వానికి తాము అండ‌గా ఉంటామ‌ని.. కేంద్ర ప్ర‌భుత్వం మ‌ద్ద‌తును ఇస్తుంద‌ని హామీ ఇచ్చారు. ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ హ‌డావుడిని స్వ‌యంగా చూసిన త‌ర్వాత మోడీకి భ‌విష్య‌త్ అవ‌స‌రాలు చ‌ప్పున గుర్తుకు వ‌చ్చాయా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏమైనా..,మోడీ తీరు ఒక అంశాన్ని స్ప‌ష్టం చేస్తుంద‌ని చెప్పాలి. త‌మ‌కు ఏదో ర‌కంగా సాయ‌ప‌డే అవ‌కాశం ఉన్న ద్వారాన్ని స‌జీవంగా నిలిపే ప్ర‌య‌త్నాన్ని మోడీ చేశారు. ఏమైనా.. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి పొడను సైతం భరించ‌లేని మోడీ.. త‌న‌కు తానే స్వ‌యంగా ఫోన్ చేసి అభినందిన వైనం చూస్తే.. మోడీ మాష్టారా మ‌జాకానా? అనిపించ‌క మాన‌దు. మొన్న దేవెగౌడ‌కు జ‌న్మ‌దిన‌ శుభాకాంక్ష‌లు చెప్ప‌డం కూడా ఇలాంటిదే.