Begin typing your search above and press return to search.

గుజరాత్ ఎన్నికల్లో పాక్ జోక్యం : ప్రధాని మోడీ

By:  Tupaki Desk   |   10 Dec 2017 3:12 PM GMT
గుజరాత్ ఎన్నికల్లో పాక్ జోక్యం : ప్రధాని మోడీ
X
ప్ర‌తిష్ఠాత్మక గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిదశ పోలింగ్‌ ముగిసినప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ విమర్శల్లో వాడి తగ్గడం లేదు. రెండోదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పాలన్పూర్‌ లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. గొంతు నొప్పి ఉన్నప్పటికీ ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఇటీవల తనను ‘నీచమైన మనిషి’ అని తూలనాడిన కాంగ్రెస్‌ మాజీ నేత మణిశంకర్‌ అయ్యర్‌ పై ప్రధాని విరుచుకుపడ్డారు. పనిలో పనిగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ - పేరు ప్రస్తావించకుండా మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. పాకిస్థాన్ నేతలతో కాంగ్రెస్ అగ్రనేతలు భేటీ అయ్యారని మోదీ ఆరోపించారు. పాక్ నేతలతో కాంగ్రెస్ నేతల భేటీపై ఆ పార్టీ వివరణ ఇవ్వాలని ప్రధాని డిమాండ్ చేశారు.

ఇటీవల కాంగ్రెస్‌ నేతలు ఓ రహస్య సమావేశం నిర్వహించారని ఆరోపించారు. ‘కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ ఇంట్లో కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు పాకిస్థాన్‌ అధికారులతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. అయ్యర్‌ ఇంట్లో జరిగిన సమావేశానికి పాకిస్థాన్‌ హైకమిషనర్‌ - పాకిస్థాన్‌ మాజీ విదేశాంగశాఖ మంత్రి - భారత మాజీ ఉపరాష్ట్రపతి (హమీద్‌ అన్సారీ) - మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హాజరయ్యారు. ఈ సమావేశం దాదాపు 3 గంటలపాటు సాగింది. ఈ భేటీ జరిగిన మరుసటి రోజు అయ్యర్‌ నన్ను ‘నీచుడు’ అని అన్నారు. ఇది చాలా గంభీరమైన అంశం’ అని పేర్కొన్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల విషయంలో పాకిస్థాన్‌ జోక్యం చేసుకుంటున్నదని, కాంగ్రెస్‌ నాయకులు పాక్‌ అధికారులతో సమావేశం కావడంపై ఆ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ ను గుజరాత్‌ ముఖ్యమంత్రిని చేయాలని పాకిస్థాన్‌ ఆర్మీ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) సర్దార్‌ అర్షద్‌ రఫీక్‌ ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నారని ప్రశ్నించారు. అహ్మద్‌ పటేల్‌ సీఎం కావడానికి రఫీక్‌ మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు.

‘ఒకవైపు గుజరాత్‌ ఎన్నికల్లో పాక్‌ జోక్యం.. మరోవైపు పాక్‌ తో కాంగ్రెస్‌ నేతల సమావేశం.. సమావేశం తర్వాత గుజరాత్‌ లోని పేదలను - బలహీనవర్గాలను - మోడీని అవమానించడం.. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలపై మీకు అనుమానం రావడం లేదా?’ అంటూ సభికులను ప్రశ్నించారు. ‘గుజరాత్‌ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఈ రహస్య భేటీ ఎందుకు జరిగింది? అసలు ఏం జరిగిందో ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ పై ఉంది’ అని పేర్కొన్నారు. కాగా ‘రహస్య సమావేశం’ గురించి టీవీలు - పత్రికల్లో వచ్చిందని చెప్పిన ప్రధాని.. వాటి పేర్లను మాత్రం వెల్లడించలేదు. ప్రధాని మోడీ వ్యాఖ్యలను కాషాయదళాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్‌ చేస్తున్నాయి. మరోవైపు ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ పేరును ప్రధాని నేరుగా ప్రస్తావించనప్పటికీ.. గాంధీనగర్‌ లో మాట్లాడిన భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మాత్రం నేరుగా పేరును వెల్లడించారు. అమిత్‌ షా కూడా ‘రహస్య సమావేశం’ గురించి వెల్లడించడం విశేషం.