Begin typing your search above and press return to search.

సంచ‌ల‌న నిర్ణ‌యానికి మోడీ క‌స‌ర‌త్తు?

By:  Tupaki Desk   |   6 Oct 2017 4:04 AM GMT
సంచ‌ల‌న నిర్ణ‌యానికి మోడీ క‌స‌ర‌త్తు?
X
క‌ల‌లో కూడా ఊహించ‌ని నిర్ణ‌యాలు తీసుకోవ‌టంలో దేశ ప్ర‌ధాని మోడీ త‌ర్వాతే. పెద్ద‌నోట్ల ర‌ద్దు.. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌.. జీఎస్టీ అమ‌లు లాంటి నిర్ణ‌యాలు ఎడాపెడా తీసుకోవ‌టం మోడీకి మాత్ర‌మే సాధ్యం. తన నిర్ణ‌యాల కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్న‌ప్ప‌టికీ.. దాని గురించి గొప్ప‌గా చెప్పుకోవ‌టం మోడీ ప‌రివారానికి మాత్ర‌మే సాధ్యం. పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం అవినీతి మీద మోడీ పూరించిన శంఖారావంగా ప్ర‌జ‌లు భావించారు.

ఆ నిర్ణ‌యం కార‌ణంగా దేశ ప్ర‌జ‌లు ప‌డి పాట్లు అన్ని ఇన్ని కావు. పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంతో దేశంలోని బ్లాక్ మ‌నీకి చెక్ ప‌డుతుంద‌ని.. ఖ‌జానాకు త‌క్కువ‌లో త‌క్కువ 2 ల‌క్ష‌ల కోట్ల మేర న‌గదు జ‌మ అవుతుంద‌ని.. ఆ మొత్తంతో మ‌రింత మెరుగ్గా ప్ర‌జాసంక్షేమ కార్య‌క్ర‌మాల్ని నిర్వ‌హించాల‌న్న ఆలోచ‌న‌లో మోడీ స‌ర్కారు ఉందంటూ క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అయితే.. అదంతా ఉత్త భ్ర‌మ అన్న విష‌యం పెద్ద‌నోట్ల ఉదంతానికి సంబంధించిన లెక్క‌ల్ని చూస్తే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. ఒకే దేశం.. ఒకే ప‌న్ను అంటూ జీఎస్టీకి భారీ ఎత్తున ప్ర‌చారం చేసి అమ‌ల్లోకి తీసుకొచ్చారు. కానీ.. ఇక్క‌డ మ‌ర్చిపోయిన పాయింట్ ఏమిటంటే.. భార‌త్ లాంటి దేశంలో జీఎస్టీ ప‌న్నుపోటు ఎంత త‌క్కువ‌గా ఉంటే అంత ఎక్కువ స‌క్సెస్ అవుతుంది. కానీ.. పాల‌కులు ఆ విష‌యాన్ని పెద్ద ప‌ట్టించుకోకుండానే జీఎస్టీని అమ‌ల్లోకి తీసుకొచ్చారు. తాము వేసుకున్న అంచ‌నాల‌న్నీ త‌ప్పి పోవ‌ట‌మే కాదు.. జీఎస్టీ శ్లాబుల్ని త‌గ్గించే దిశ‌గా క‌స‌ర‌త్తు చేస్తోంది కేంద్ర స‌ర్కారు.

ఇలా.. మోడీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్ర‌క‌టించిన రెండు కార్య‌క్ర‌మాలు అడ్డంగా ఫెయిల్ కావ‌టం ఒక ఎత్తు అయితే.. గ‌డిచిన రెండు మూడు రోజులుగా దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఏదో జ‌రుగుతుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ సందేహానికి మ‌రింత బ‌లం చేకూరేలా బీజేపీ చీఫ్ అమిత్ షా త‌న కేర‌ళ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌ను అర్థాంతంగా ముగించుకొని హుటాహుటిన ఢిల్లీకి ప‌య‌నం కావ‌టం ప‌లు సందేహాల‌కు తెర తీస్తోంది.

ప్ర‌ధాని మోడీ.. ఆర్థిక‌మంత్రి జైట్లీ.. బీజేపీ చీఫ్ అమిత్ షాలు ముగ్గురు భేటీ అయి దాదాపు మూడు గంట‌ల పాటు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌టం రాజ‌కీయంగా క‌ల‌క‌లాన్ని రేపుతోంది. ఏదైనా కీల‌క నిర్ణ‌యాన్ని మోడీ ప్ర‌క‌టించ‌నున్నారా? అన్న‌ది ఇప్పుడు సందేహంగా మారింది. జీఎస్టీ అమ‌ల్లో లోపాల్ని స‌రిదిద్ద‌టంతో పాటు.. భారంగా ఉన్నాయంటూ ప్ర‌జ‌ల నుంచి అందుతున్న ఫిర్యాదుల నేప‌థ్యంలో ఇప్పుడున్న శ్లాబుల్లో మార్పులు చేయాల‌ని మోడీ స‌ర్కారు భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. దాదాపు 60కి సైగా వ‌స్తువుల‌పై ప‌న్నుల్ని త‌గ్గించాల‌న్న‌ది ప్రాధ‌మికంగా అనుకున్న ఆలోచ‌న‌గా చెబుతున్నారు. అంతేకాదు.. చిన్న.. మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌కు ఊర‌ట క‌లిగించేలా నిర్ణ‌యం తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో మోడీ స‌ర్కారు ఉన్న‌ట్లుగా స‌మాచారం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజా భేటీ జీఎస్టీ మీద కాద‌ని.. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించే జ‌మిలి ఎన్నిక‌ల అంశంపై కీల‌క‌నిర్ణ‌యాన్నిమోడీ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందంటున్నారు. ఈ వాద‌న‌కు బ‌లం చేకూరేలా కేంద్ర ఎన్నిక‌ల సంఘం సైతం దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌టానికి వీలుగా ఈవీఎంల‌ను సిద్ధం చేయ‌గ‌ల‌మ‌ని..అందుకు అవ‌స‌ర‌మైన నిధుల్ని అందించాల‌ని కేంద్రాన్ని కోరటం గ‌మ‌నార్హం.

అయితే.. తాజాగా జరిగిన స‌మావేశం పూర్తిగా జీఎస్టీకి సంబంధించిందే త‌ప్పించి జ‌మిలి ఎన్నిక‌ల మీద కాద‌ని.. ఇటీవ‌ల‌కాలంలో జీఎస్టీ మీద ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న అసంతృప్తితో పాటు.. పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల విష‌యం ప్ర‌భుత్వ బాదుడుపై ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించే దిశ‌గా కీల‌క నిర్ణ‌యాన్ని మోడీ స‌ర్కారు తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

పెట్రోల్‌.. డీజిల్ విష‌యంలో మోడీ కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం త‌క్కువ‌ని చెబుతున్నారు. ఎందుకంటే.. వీటిపై వ‌చ్చే ఆదాయంపై ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున ఆధార‌ప‌డి ఉంద‌ని.. దానికి బ‌దులుగా 60కి పైగా వ‌స్తువ‌ల‌పై జీఎస్టీ భారాన్ని త‌గ్గిస్తార‌ని చెబుతున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం కొత్త‌గా త‌గ్గించే వ‌స్తువ‌ల ప‌న్నుశ్లాబుల‌న్నీ 18 శాతం జాబితాలో ఉన్న‌వేన‌ని తెలుస్తోంది. 18 శాతం నుంచి 12 శాతానికి కుదిస్తార‌ని.. కొన్ని 28 శాతం ఉన్న వాటిని 18 శాతానికి త‌గ్గించే వీలుంద‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. ఇదెంత వ‌ర‌కూ నిజ‌మ‌న్న‌ది వెయిట్ చేస్తే కానీ అర్థం కాదు.