Begin typing your search above and press return to search.
ఎన్డీఏ నాలుగేళ్ల పాలన...మోడీ కీలక నిర్ణయం
By: Tupaki Desk | 24 May 2018 4:34 PM GMTబీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు.. మోడీ ప్రధాని అయ్యి నాలుగేళ్లు అయ్యింది. మరో ఏడాదిలో ఎన్నికలు. ఇంతటి కీలక సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో మొదటిది, బహిరంగంగా తెరమీదకు వచ్చింది పార్టీ పరమైన అంశం కాగా, రెండోది మోడీ వ్యక్తిగత నిర్ణయం. మే 26వ తేదీతో నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా... నిజాయితీతోనే సంపూర్ణ అభివృద్ధి నినాదంతో మోడీని సరికొత్తగా పార్టీ ప్రమోట్ చేయబోతోంది. అందుకుగాను ప్రత్యేకంగా టీం తయారు చేసింది.
ఇదిలాఉండగా...ప్రధాని మోడీ వ్యక్తిగతంగా కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసిన మోడీ ఇప్పుడు అదే ఫార్ములాను ఫాలో కానున్నారట. ఇదే విశేషం అనుకుంటే ఆయన నియోజకవర్గం మారనున్నారనేది ప్రధాన అంశం. గత ఎన్నికల్లో రెండు తన స్వరాష్ట్రమైన గుజరాత్‌లోని వడోదర, ఢిల్లీకి దగ్గరి దారి అనే పేరున్న యూపీలోని వారణాసి నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. మోడీ ఈ దఫా ఒడిషాకు మారనున్నారట. ఒడిషాలోని పూరి నుంచి ఆయన బరిలో దిగనున్నారని తెలుస్తోంది. ఈ నిర్ణయం వెనుక ఓ వైపు సెంటిమెంట్ మరోవైపు రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయని జాతీయ మీడియా సంస్థ ఒక కథనం వెలువరించింది.
ఆ మీడియా సంస్థ కథనం ప్రకారం పశ్చిమ బెంగాల్ - ఒడిశా - ఆంధ్ర ప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ అంత బలంగా లేకపోవడంతో బీజేపీ పెద్దలు స్పెషల్ ఫోకస్ పెట్టారని సమాచారం. తెలుగు రాష్ర్టాలతో పాటుగా పశ్చిమబెంగాల్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీంతో సుదీర్ఘంగా దాదాపు 18 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేడీని దెబ్బకొట్టేందుకు పూరి నుంచి బరిలోకి దిగాలని మోడీ ఆలోచన అంటున్నారు. అక్కడ గెలవడం ద్వారా బీజేపీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం పెరుగుతుందని ఆ కథనంలో పేర్కొన్నారు. కాగా, గత ఎన్నికల్లో శివుడి సెంటిమెంట్‌తో వారణాసిలో గెలిచిన మోడీ..ఇప్పుడు విష్ణువు సెంటిమెంట్‌తో పూరి నుంచి బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారని సదరు కథనం పేర్కొంది.