Begin typing your search above and press return to search.

ప్ర‌ధానికి గాడిదలంటే ఎంతో ఇష్ట‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   24 Feb 2017 6:00 AM GMT
ప్ర‌ధానికి గాడిదలంటే ఎంతో ఇష్ట‌మ‌ట‌!
X
గుజరాత్ గాడిదలకు మ‌ద్ద‌తు ఇవ్వ‌కండ‌ని ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సెటైర్ వేశారు. సీఎం అఖిలేష్‌ కు గాడిద‌లంటే భయమని ప్రధాని అన్నారు. విశ్వాసంగా, కష్టపడి పనిచేసే గాడిదలు తనకు స్ఫూర్తి అని ఆయన చెప్పారు. అఖిలేశ్ చేసిన గాడిద వ్యాఖ్యలు ఆయన కులపిచ్చి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని, విద్వేష భావాలు ఆయనకు తగవని మోడీ హితవు పలికారు. "ఎన్నికల్లో ప్రత్యర్థులు పరస్పరం విమర్శించుకోవడం సహజమే. మోడీని, బీజేపీని మీరు విమర్శిస్తే నేను అర్థం చేసుకోగలను. అయితే గుజరాత్ గాడిదలను మీరు విమర్శించడం ఆశ్చర్యంగా ఉంది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గాడిదలంటే మీకు భయమా?" అని మోడీ ప్రశ్నించారు.

భార‌త‌దేశ‌ దేశ ప్రజలే తనకు యజమానులని, వారి కోసం రాత్రి, పగలు కష్టపడుతున్న తనకు గాడిదలే స్పూర్తి అని ప్ర‌ధాన‌మంత్రి స్ప‌ష్టం చేశారు. జంతువుల మీద కూడా అఖిలేశ్ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. యజమానికి గాడిద వినయంగా ఉంటుందని, యజమాని చెప్పిన పని ఎంతయినా, దానికి అనారోగ్యంగా ఉన్నా, ఆకలిగా ఉన్నా చేస్తుందని అన్నారు. "గాడిదలు వాటి వీపు మీద మోసేదానిపై వివక్ష చూపవు. అది చక్కెర అయినా, అవినీతిపరులైనా గాడిద మోస్తుంది. అఖిలేశ్‌ జీ.. గుజరాత్ గాడిదలను మీరు అసహ్యించుకోవచ్చేమో. దయానంద సరస్వతి, మహాత్మా గాంధీ, భగవాన్ శ్రీకృష్ణుడు వంటి మహానుభావులకు జన్మనిచ్చింది గుజరాతే" అని మోడీ పేర్కొన్నారు.

ఇదిలాఉండ‌గా... ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ - కాంగ్రెస్ కూటమి విసురుతున్న సవాల్‌ను ఎదుర్కొనేందుకు ద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. "ఇంతకుముందు ప్రధాని మోడీ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఎస్పీ - కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తుతో ఆయన మోములో చిరునవ్వు మాయమైంది. ఆయన ఆలోచన మారిపోయింది. విభజన రాజకీయాలు చేపట్టడంపై ఆయన దృష్టి సారించారు" అని రాహుల్ మండిప‌డ్డారు. 'మోడీజీ ద్వేషాన్ని ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ఆయన బీహార్‌ లో ద్వేషపూరిత రాజకీయాలు చేశారు. యూపీలోనూ అదే చేస్తున్నారు' అని అన్నారు. పిల్లలు హిందువైనా, ముస్లిం అయినా మానవులే అని రాహుల్ గాంధీ చెప్పారు. బీజేపీ, ఆరెస్సెస్‌లు దేశానికి మహాత్మాగాంధీ, సర్ధార్ పటేల్, భగత్ సింగ్ వంటి మహానేతలను అందించలేదన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/