Begin typing your search above and press return to search.

మోడీ వార్నింగ్ ఓకే...మ‌రి వేటు వేయ‌లేదెందుకు?

By:  Tupaki Desk   |   3 July 2019 5:24 AM GMT
మోడీ వార్నింగ్ ఓకే...మ‌రి వేటు వేయ‌లేదెందుకు?
X
గ‌తంలో ఎప్పుడు లేని రీతిలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నేరుగా వార్నింగ్ ఇచ్చేశారు. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే నేత‌ల మీద పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్పుడు ప‌రోక్షంగా రియాక్ట్ అయ్యే మోడీ అందుకు భిన్నంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజ‌య్ వ‌ర్గియా దాడి ఉదంతంలో మాత్రం అందుకు భిన్నంగా రియాక్ట్ అయ్యారు.

మున్సిప‌ల్ అధికారిపై క్రికెట్ బ్యాట్ తో ఆకాశ్ విజ‌య్ దాడి చేయ‌టం.. ఈ ఉదంతం పెను సంచ‌ల‌నంగా మారి మోడీ స‌ర్కారు మీద విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌టం తెలిసిందే. బీజేపీకి చెడ్డ‌పేరు తెచ్చిన ఈ ఉదంతంపై స్పందించిన పోలీసులు అకాశ్ ను అరెస్ట్ చేశారు. అనంత‌రం బెయిల్ మీద విడుద‌లైన ఆయ‌న‌.. ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా త‌న బ్యాట్ కు ప‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేయొద్దంటూ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

పార్టీకి చెడ్డ పేరు తెచ్చి కూడా వెన‌క్కి త‌గ్గ‌ని తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఇలాంటివేళ‌.. తాజాగా ఎంపీల‌తో భేటీ అయిన మోడీ..గ‌తంలో ఎప్పుడూ లేనంత‌గా రియాక్ట్ అయ్యారు. తీవ్ర‌స్వ‌రంగా వార్నింగ్ ఇచ్చేశారు. వివాదాస్ప‌ద ఎమ్మెల్యే ఆకాశ్‌.. బీజేపీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కైలాశ్ విజ‌య్ వ‌ర్గియా కుమారుడేన‌న్న విష‌యం తెలిసిందే.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. జైలుకు వెళ్లి.. బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆకాశ్ కు పెద్ద ఎత్తున స్వాగ‌తం ప‌ల‌క‌టానికి బీజేపీ కార్య‌క‌ర్త‌లు చేసిన అతిపైనా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఆయ‌న చేసిన ప‌నికి భారీ స్వాగ‌త ఏర్పాట్లు అవ‌స‌ర‌మా? అన్న ప్ర‌శ్న‌లు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో పార్టీ ఎంపీల‌కు గతంలో ఎప్పుడూ లేనంత తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు మోడీ.

ఎవ‌రి కొడుకైనా స‌రే హ‌ద్దులు దాటితే ఊరుకునేది లేద‌ని.. చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని.. వారికి మ‌ద్ద‌తు ఇచ్చే వారిని కూడా తీసేయాలంటూ గ‌ట్టిగానే హెచ్చ‌రించారు. ఇందులో ఎవ‌రికి ఎలాంటి మిన‌హాయింపులు లేవు. పార్టీ పేరు చెప్పి దురుసుగా ప్ర‌వ‌ర్తించే హ‌క్కు ఎవ‌రికి లేదన్న మోడీ మాట‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వంటున్నారు. మోడీ ఇంత స్ప‌ష్టంగా.. సూటిగా వార్నింగ్ ఇచ్చేసిన త‌ర్వాత కూడా పార్టీ అధినేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అమిత్ షా మ‌త్రం ఆయ‌న‌పై వేటు వేసే నిర్ణ‌యాన్ని తీసుకోక‌పోవ‌టం గ‌మ‌నార్హం. బిగ్ బాస్ లాంటి మోడీ నోటి నుంచి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న మాట అంత క్లియ‌ర్ గా వ‌చ్చేసిన త‌ర్వాత కూడా షా మాష్టారు ఎందుకింకా కొర‌డా విద‌ల్చ‌లేదు?