Begin typing your search above and press return to search.

మోడినే సెల్ప్ గోలు వేసుకుంటున్నారా ?

By:  Tupaki Desk   |   11 Aug 2021 5:35 AM GMT
మోడినే సెల్ప్ గోలు వేసుకుంటున్నారా ?
X
జాతీయస్ధాయి రాజకీయాలను చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. 2014లో గెలిచిన తర్వాత నరేంద్రమోడి ప్రభ జాతీయస్ధాయిలో బ్రహ్మండంగా వెలిగిపోయింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లాంటివి వ్యక్తిగతంగా, దేశ ఆర్ధిక వ్యవస్ధను సంక్షోభంలోకి నెట్టేసినా జనాలు భరించారు. మొదటి ఐదేళ్ళ పాలన చెప్పుకోదగ్గ స్ధాయిలో లేకపోయినా మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వాలనే 2019లో తిరిగా పట్టంకట్టారు. అయితే దాన్ని మోడి తప్పుగా అర్ధం చేసుకున్నారు.

తనకు దేశంలో ప్రత్యామ్నాయం లేదని, తనను ఎదిరించి ఢీకొనేంత సీన్ ఎవరికీ లేదని మోడి అనుకున్నట్లున్నారు. అందుకనే తాను ఆడిందే ఆట పాడిందే పాటగా పరిపాలన మొదలుపెట్టారు. మంత్రివర్గంలోని వాళ్ళను, పార్టీలోని సీనియర్ నేతలను, ప్రతిపక్షాలను లెక్కచేయటం మానేశారు. చివరకు మిత్రపక్షాలను కూడా అసలు దగ్గరకే రానీయటంలేదు. మంత్రివర్గంలోని ఎవరి అభిప్రాయాలకూ విలువలేకుండాపోయింది.

ఇందులో భాగంగానే మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు. మిత్రపక్షాలకు చెందిన మంత్రులు చెప్పినా వినలేదు. రైతుసంఘాలు చెప్పిన అభ్యంతరాలను కూడా పట్టించుకోవటంలేదు. దాంతో లాభంలేదని మిత్రపక్షం అకాలీదళ్ మంత్రివర్గంలో నుండి బయటకు వచ్చేసింది. అంటే మోడి నియంతృత్వ వైఖరికి మొదటి దెబ్బనే భావించాలి. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తు రైతుసంఘాలు నెలల తరబడి ఢిల్లీ శివార్లలో ఆందోళనలు చేస్తునే ఉన్నారు.

ఇదే సమయంలో కేంద్రం రూపొందించిన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రింకోర్టు స్టే విధించింది. అంటే ఇది మోడి వైఖరిపై రెండో దెబ్బనే అనుకోవాలి. ఈమధ్యలోనే బెంగాల్లో మమతబెనర్జీని ఓడించటానికి మోడి, అమిత్ షా లు చేయని ప్రయత్నాలు లేవు. అయినా బెంగాల్ జనాలు మమతకే మూడోసారి పట్టంకట్టారు. ఇది మోడికి తగిలిన మూడో దెబ్బ. ఇపుడు మోడికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. బద్దశృవులైన కాంగ్రెస్-మమతలు చేతులు కలపటం మోడి పుణ్యమనే చెప్పాలి.



2019 నాటికి మోడికి ప్రత్యామ్నాయమే లేదని అనుకున్న జనాలే ఇపుడు ప్రత్యామ్నాయంగా రాహూల్ , మమతల పేర్లను ప్రస్తావిస్తున్నారు. అంటే మోడియే తనకు ప్రత్యామ్నాయాలను బలమైన ప్రతిపక్షాన్ని తయారు చేసుకుంటున్నారన్నమాట. ఇదే సమయంలో కరోనా వైరస్ కావచ్చు, వివిధ రాష్ట్రాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్లా కావచ్చు మోడిపై రాజకీయపార్టీల్లోనే కాకుండా మామూలు జనాల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోతోంది. అందుకనే తమ మధ్య వైరుధ్యాలను పక్కనపెట్టి మరీ ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఇప్పటి డెవలప్మెంట్ ఇది మరి ముందు ముందు ఏమవుతుందో చూడాలి.