Begin typing your search above and press return to search.

సెంట్రల్ విస్టా : 2022 డిసెంబర్ నాటికి ప్రధాని కొత్త భవనం సిద్ధం !

By:  Tupaki Desk   |   4 May 2021 4:31 AM GMT
సెంట్రల్ విస్టా : 2022 డిసెంబర్ నాటికి ప్రధాని కొత్త భవనం సిద్ధం !
X
నూతన పార్లమెంట్, ప్రభుత్వ భవనాల ఆధునికీకరణకు సంబంధించి 2019 సెప్టెంబర్ లో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ను కేంద్రం చేపట్టింది. ఈ భవనంలో 900 నుంచి 1,200 మంది పార్లమెంట్ సభ్యులు కూర్చునేందుకు వీలుగా.. త్రిభుజాకారంలో నిర్మించనున్నారు. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం (2022 ఆగస్టు 15) నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే ప్రాజెక్టులో ఉమ్మడి కేంద్ర సచివాలయాన్ని 2024లోపు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక ,2020 డిసెంబర్ 10న పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా 2022 డిసెంబర్‌ లో గా నిర్మించనున్న ప్రధానమంత్రి నూతన నివాస భవనానికి పర్యావరణ అనుమతులు లభించాయి.

కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో దాదాపు అన్ని రంగాలకు చెందిన కార్యకలాపాలపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు మాత్రం అత్యంత వేగంగా నిర్మాణం జరుగుతుంది. కరోనా కారణంగా లాక్‌ డౌన్ విధించినప్పటికీ నిర్మాణ పనులు ఆగకుండా ఉండేందుకు సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం గుర్తించి పనులు జరిగేలా నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో విమర్శిస్తున్నప్పటికీ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణంలో తగ్గేది లేదని ప్రకటించిన కేంద్రం నిర్ణీత సమయానికల్లా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేలా పక్కా వ్యూహాలు అమలు చేస్తుంది. వచ్చే ఏడాది నిర్మాణం పూర్తి కానున్న భవనాలలో ప్రధానమంత్రి కొత్త భవనం కూడా ఉంది. ప్రధానమంత్రి భద్రతకు సంబంధించిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్‌ పిజి) ప్రధాన కార్యాలయం, అధికారుల కోసం ప్రత్యేక భవనం నిర్మాణాలు కూడా ఆ గడువులోగానే పూర్తి కావాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రధాన మంత్రి అధికారిక నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్(ఒకప్పటి రేస్ కోర్సు రోడ్)లో ఉంది. ఉప రాష్ట్రపతి నివాస భవనం వచ్చే ఏడాది మే నాటికి పూర్తి కావలసి ఉంటుంది. ఈ కొత్త భవనాల నిర్మాణానికి రూ.13,450 కోట్లు ఖర్చు కానునట్లు అంచనా వేశారు.