Begin typing your search above and press return to search.

మోడీతో పెట్టుకుంటే డ్రాగన్ కు భారీ దెబ్బ తప్పదా?

By:  Tupaki Desk   |   20 Jun 2020 10:10 AM GMT
మోడీతో పెట్టుకుంటే డ్రాగన్ కు భారీ దెబ్బ తప్పదా?
X
సలసలా కాగే నూనెను ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ చిన్న తేడా వచ్చినా.. నూనెను కాగించినోడికే దెబ్బ. ఇప్పుడు ఇదే సూత్రం చైనాకు వర్తిస్తుంది. ఇప్పటికే మాయదారి రోగాన్ని ప్రపంచానికి అంటించిన దేశంగా యావత్ ప్రపంచం ఉడికిపోతోంది. కలలో కూడా కనని రీతిలో ప్రపంచాన్ని మార్చేసిన పాపం డ్రాగన్ దేశానిదే అన్న భావన అంతకంతకూ పెరుగుతోంది.

ఇది సరిపోదన్నట్లుగా తన అధీనంలో ఉన్న హాంకాంగ్ మొదలు ప్రతి ఒక్కరితో ఏదోలా పేచీ పెట్టుకునే చైనా చెత్తబుద్ధి.. ఇప్పటికి మారలేదు. భారత్ అందించే స్నేహహస్తాన్ని అందుకోకుండా.. దొంగదెబ్బ తీయాలనుకునే చైనా వక్రబుద్దిపై ఇప్పుడు ప్రతిఒక్కరూ దుమ్మెత్తి పోస్తున్నారు. గతంతో పోలిస్తే.. చైనాకు ఈ రోజున అంతర్జాతీయంగా ఉన్న ఇమేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే.

అందరూ కలిసి మీద పడిపోవటం లేదు కాబట్టి చైనా బతికిపోతోంది. ఇప్పటికే అగ్రరాజ్యం డ్రాగన్ దేశాన్ని దెబ్బ తీయాలన్న కసితో ఉంది. సరైన హెచ్చరికలు జారీ చేయని చైనా కారణంగా 1.21లక్షల అమెరికన్ల ప్రాణాలు పోయినందుకు ఆ దేశం పడే వేదన అంతా ఇంతా కాదు. సరైన టైం కోసం ఎదురుచూస్తున్న అగ్రరాజ్యానికి భారత్ లాంటి దేశం తోడైతే.. డ్రాగన్ కే ఎక్కువ నష్టం వాటిల్లటం ఖాయం. ఇప్పటివరకూ చైనా అన్నంతనే ప్రపంచంలోని చాలా దేశాలకు ఒకలాంటి బెరుకు ఉందన్నది వాస్తవం.
ఇలాంటి పరిస్థితి నుంచి వారి బలం మీద పడే దెబ్బ.. డ్రాగన్ ఫియర్ ను తగ్గించేలా చేస్తోంది. అదే జరిగితే.. చైనాకు ఎదురయ్యే సమస్యలు అన్ని ఇన్ని కావు. ఒక బలమైన నియంత తనకున్న అధికారంతో జనాల్ని ఆడుకున్నా.. వారంతా ఊరుకుంటారెందుకు? ప్రాణభయం కానీ.. వాడితో పెట్టుకుంటే ఏమవుతుందన్న భయంతో. కానీ.. అలాంటి దాన్ని పటాపంచలు చేసే కథానాయకుడు సీన్లోకి వచ్చినంతనే భయం పోయి.. చిన్నపిల్లాడు సైతం చెలరేగిపోతాడు. అప్పటివరకూ తిరుగులేని శక్తి కాస్తా.. ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఇందుకు చైనాఅతీతమేమీ కాదు. తనకు తిరుగులేదన్నట్లుగా విర్రవీగుతున్న వేళ.. భారత్ తో పెట్టుకోవటం కొరివితో తలగోక్కున్నట్లే. బలవంతుడు మూడు దెబ్బలు కొడితే.. కాస్తబలం తక్కువ ఉన్నోడు రెండు దెబ్బలైనా కొట్టకుండా ఉంటాడా?

బలవంతుడ్ని దెబ్బ కొట్టటం కూడా కలలో సాధ్యం కాదనే భ్రమలు తొలిగినంతనే.. చైనా మీద చెలరేగిపోయేందుకు.. ఆ దేశం చేసిన దారుణాలకు బదులు చెప్పటానికి ఇప్పటికే ఎన్నో దేశాలు సిద్ధంగా ఉన్నాయి. అలాంటప్పుడు కాస్త అదును దొరికితే చాలు చెలరేగిపోవటమే కాదు.. డ్రాగన్ అధిక్యతకు సమాధి కట్టే వరకూ విశ్రమించనోళ్లు ఎందరో ఉన్నారు. ఎక్కడిదాకానో ఎందుకు? చైనాలోని నియంత పాలనకు ప్రపంచ దేశాల నుంచి సాయం అందాలేకానీ.. ముందా దేశంలోనే అంతర్యద్దం స్టార్ట్ అయినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి పరిస్థితులన్ని ఎప్పుడు వస్తాయంటే.. భారత్ తో గోక్కున్నప్పుడన్నది మర్చిపోకూడదు. అందుకే..భారత్ తో పెట్టుకుంటే డ్రాగన్ కు దిమ్మ తిరిగిపోయే షాకులకే ఎక్కువ అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.