Begin typing your search above and press return to search.

మోడీని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   11 Oct 2016 3:36 PM GMT
మోడీని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారా?
X
ప్రధాని కుర్చీలో కూర్చున్న తర్వాత నుంచి ఆయనకు సంబంధించిన వివరాల్ని తెలుసుకునేందుకు దేశ ప్రజలు విపరీతమైన కుతూహలాన్ని ప్రదర్శిస్తున్నారట. మోడీకి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు చూపిస్తున్న ఉత్సాహానికి ప్రధానమంత్రి కార్యాలయం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సమాచార హక్కు చట్టం పేరుతో దేశ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు వింతగా.. విచిత్రంగా ఉంటున్నాయట. గతంలో ప్రధానమంత్రులుగా వ్యవహరించిన వారి హయాంతో పోలిస్తే.. మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఈ తరహా సందేహాలు ఎక్కువైనట్లు చెబుతున్నారు.

ప్రధానమంత్రికి సంబంధించి అర్థవంతమైన సందేహాలైతే ఫర్లేదు. కానీ.. చాలా సందర్భాల్లో అవి శ్రుతిమించినట్లుగా ఉన్నట్లు చెబుతున్నారు. మోడీకి సంబంధించిన వ్యక్తిగత ప్రశ్నల్ని అడిగేందుకు సైతం వెనుకాడని వైనం అధికారుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొన్ని సందర్భాల్లో అయితే.. ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక.. అధికారులు కిందామీదా పడుతున్నట్లు చెబుతున్నారు. కొన్ని కీలకమైన ప్రశ్నలైతే.. మరికొన్ని ప్రశ్నలు చాలా సిల్లీగా ఉన్నాయన్న అభిప్రాయ పడుతున్నారు.

మోడీ వ్యక్తిగతానికి సంబందించిన చాలా ప్రశ్నలకు సమాచారం ఇవ్వలేమంటూ పీఎంవో అధికారులు స్పష్టం చేయటంతో పాటు.. ఈ ప్రశ్నల ప్రవాహానికి చెక్ చెప్పేందుకు తాజాగా కొన్ని సూచనలు చేయటం గమనార్హం. సమాచారం కోరే వారు.. ఏది పడితే అది అడగొద్దని.. ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే అడగాలని కోరుతున్నారు. సమాచార హక్కు చట్టం పేరుతో పీఎంవోకు వస్తున్న పలు సందేహాలు తమకు సంబంధం లేనివి కూడా వస్తున్నట్లు చెబుతున్నారు. ఏ మాత్రం సంబంధం లేని ప్రశ్నల జోరు ఎంత ఎక్కువగా ఉందన్న విషయానికి వస్తే.. సరాసరిన రోజుకు ప్రధాని కార్యాలయానికి 1500 ప్రశ్నలు వస్తుంటే.. అందులో 70 శాతం ఏమాత్రం అవసరం లేని ప్రశ్నలే ఉంటున్నాయట.

ఇక.. ప్రధానమంత్రిని అడుగుతున్న ప్రశ్నల పరంపరను చూస్తే.. అందులో మోడీ వంటింట్లో ఎన్ని సిలిండర్లు వినియోగిస్తున్నారు? వంటకు వాడిన కూరగాయలకు ఎంత ఖర్చు పెట్టారు? ఇక.. ప్రధాని వినియోగించే ఇంటర్నెట్ స్పీడ్ ఎంత? ప్రధానమంత్రి కార్యాలయానికి ఉన్న చట్టబద్ధత ఎంత? గడిచిన పదేళ్ల కాలంలో ప్రధాని ఎన్ని సిక్ లీవులు తీసుకున్నారు? ప్రధాని వెబ్ సైట్ తయారీకి ఎంత ఖర్చు అయింది? పీఎంవోల వైఫై వేగం ఎంత? ప్రధాని ఫోన్ల జాబితా ఇవ్వండి.. ప్రధానమంత్రి రాజ్యాంగాన్ని చదివారా? ప్రధానమంత్రి పూర్తి చిరునామా ఇస్తారా? ప్రధాని బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలేంటి? మూడు నెలల బ్యాంకు స్టేట్ మెంట్ ఇవ్వండి.. పీఎంవో అధికారులు ఎన్ని టూర్లకు వెళ్లారు? అందుకోసం ఎంత ఖర్చు చేశారు? లాంటి ప్రశ్నలు తరచూ వస్తుంటాయట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/