Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని మోడీ ఆస్తి ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   19 Sep 2018 5:07 AM GMT
ప్ర‌ధాని మోడీ ఆస్తి ఎంతో తెలుసా?
X
ఒక రోజు వేసిన డ్రెస్ మ‌రో రోజు వేసిన‌ట్లుగా క‌నిపించ‌ని స్పెష‌ల్ ప్ర‌ధాని మోడీ సొంతంగా కొంద‌రు అభివ‌ర్ణిస్తుంటారు. ఆయ‌న‌గారి ఖ‌రీదైన దుస్తుల వ్య‌వ‌హారం ఒక‌సారి బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌రిగిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. త‌న‌ను విమ‌ర్శ‌ల పాలు చేసిన స‌ద‌రు డ్రెస్సును వేలం వేసేసి.. ఆ వ‌చ్చిన సొమ్మును ఛారిటీకి ఇచ్చేసినా.. మోడీ ధ‌రించే దుస్తుల్ని ఒక కంట చూడ‌టం అంద‌రికి ఒక అల‌వాటుగా మారింది.

అలా.. దేశంలో మ‌రే రాజ‌కీయ అధినేతకు లేని రీతిలో స్టైలీష్ గా వ్య‌వ‌హ‌రించే మోడీ ఆస్తి ఎంత ఉంటుంది? అన్న సందేహం చాలామందికి క‌లగ‌క‌మాన‌దు. తాజాగా ఆయ‌న ఆస్తి వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే.. చాలామంది అనుకున్న‌ట్లుగా ఆయ‌న‌కు భారీ ఆస్తిపాస్తులు ఏ మాత్రం లేవు. అధికారికంగా ఆయ‌న ఆస్తి కేవ‌లం రూ.2.5కోట్లు మాత్ర‌మేన‌ని చెబుతున్నారు.

ఇందులో క్యాష్ రూ.50వేలు మాత్ర‌మేన‌ని.. ఫిక్సెడ్ డిపాజిట్లు కోటి రూపాయిల వ‌ర‌కూ ఉన్న‌ట్లుగా తేల్చారు. ఆయ‌న‌కున్న బంగారు ఆభ‌ర‌ణాలు ఉంగ‌రం లాంటివి ల‌క్ష రూపాయిల‌కు పైనే వాల్యూ ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇవి కాక మ‌రో రెండు ల‌క్ష‌ల రూపాయిల్ని పెట్టుబ‌డుల రూపంలో పెట్టిన‌ట్లుగా వెల్ల‌డైంది.

ఇవి కాక‌.. గాంధీన‌గ‌ర్‌ లో చిన్న స్థ‌లం ఉంది. దీన్ని ఆయ‌న 2002లో రూ.1.30ల‌క్ష‌లు పెట్టి కొన్న‌ట్లుగా అధికారిక రికార్డులు ఉన్నాయి. మ‌రి.. బ‌హిరంగ మార్కెట్లో ఇప్పుడు దాని విలువ ఎంత‌న్న‌ది లెక్కించ‌లేద‌ని చెప్పాలి. ఈ ఆస్తుల‌తో పాటు.. వార‌స‌త్వంగా వ‌చ్చిన ఒక ఇల్లు ఉంది. దాని విలువ కోటి రూపాయిల వ‌ర‌కూ ఉంటుంద‌ని చెబుతున్నారు.

అయితే.. ఆ ఇంట్లో నాలుగో వంతు మాత్ర‌మే ఆయ‌న వాటా కింద‌కు వ‌స్తుంద‌ని చెబుతున్నారు.ఆస్తులే కానీ ప్ర‌ధాని మోడీకి ఎలాంటి అప్పులు లేవ‌ని చెబుతున్నారు. ఆయ‌న పేరు మీద కార్లు.. బైకులు లేవు. అదే విధంగా బ్యాంకులో లోన్లు లేవు. త‌న ఆస్తి వివ‌రాల్ని ప్ర‌ధాని స్వ‌చ్చందంగా వెల్ల‌డించారు.

ఈ వివ‌రాల‌న్నీ ఈ ఏడాది మార్చి 31 నాటి ప్ర‌ధాని మోడీ ఆస్తిపాస్తులుగా చెబుతున్నారు. వంక పెట్ట‌లేని రీతిలో ఆస్తులు ఉన్నాయి. అంతా బాగుంది కానీ.. మోడీ మాష్టారి దుస్తుల‌కు ఏటా పెట్టే ఖ‌ర్చు ఎంత‌న్న విష‌యం మీద కూడా కాస్తంత క్లారిటీ ఇచ్చి ఉంటే మ‌రింత బాగుండేదేమో?

కాగా, సొంత కారు లేక‌పోవ‌డం వ‌ల్లే పెట్రోల్‌ - డీజిల్ ధ‌ర‌ల విష‌యంలో మోడీజీ సామాన్యుల ఆక్రంధ‌న‌లు ప‌ట్టించుకోవ‌డం లేదంటూ ప‌లువురు నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు.