Begin typing your search above and press return to search.

పీఎన్‌ బీ స్కాం...ఇంకో షాకింగ్ న్యూస్‌

By:  Tupaki Desk   |   28 Feb 2018 4:42 AM GMT
పీఎన్‌ బీ స్కాం...ఇంకో షాకింగ్ న్యూస్‌
X
భార‌త‌ బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేసి... దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణంగా రికార్డుకెక్కిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ స్కాం విలువ మరింత పెరిగింది. ఇప్పటికే పీఎన్‌ బీ కుంభకోణాని కి తోడుగా మరో రూ.1,323 కోట్ల మోసపూరిత లావాదేవీలను గుర్తించామని పీఎన్‌ బీ తాజాగా వెల్లడించింది. దీంతో ముందుగా అంచనా వేసినట్లుగా ఈ స్కాం విలువ రూ.11,394.02 కోట్ల (1.77 బిలియన్ డాలర్లు)ను మించిపోయి రూ.12,717.02 కోట్ల (దాదాపు 2 బిలియన్ డాలర్లు)కు చేరింది. ఈ క్రమంలో ఇంకో మోసం వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకోగా - లోతుగా పరిశీలిస్తే మరిన్ని మోసాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ముంబైలోని పీఎన్‌ బీ బ్రాడీ హౌజ్ శాఖ నుంచి మోసపూరితంగా జారీ అయిన లెటర్ ఆఫ్ అండర్‌ టేకింగ్ లేదా అండర్‌ స్టాండింగ్ (ఎల్‌ వోయూ) - ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ వోసీ)లతోనే ఈ కుంభకోణం మొత్తం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎల్‌ వోయూలు - ఎల్‌ వోసీల ఆధారంగానే ఇతర దేశీయ బ్యాంకులకు చెందిన విదేశీ శాఖల్లోగల పీఎన్‌ బీ ఖాతాల (నోస్ట్రో అకౌంట్లు) నుంచి నీరవ్ మోడీ - ఆయన మేనమామ మెహుల్ చోక్సీల కంపెనీలు పెద్ద ఎత్తున రుణాలు పొందాయి. దీనివల్ల జరిగిన నష్టం దాదాపు రూ.11,400 కోట్లుగా పీఎన్‌ బీ అంచనా వేసింది. అయితే మరిన్ని ఎల్‌ వోయూలు బయటపడినట్లు పీఎన్‌ బీ చెప్పింది. డాలర్‌ తో పోల్చితే ప్రస్తుత రూపాయి మారకం విలువ ప్రకారం వీటి విలువ రూ.1,323 కోట్లుగా ఉంటుందని సోమవారం రాత్రి స్టాక్ ఎక్సేంజ్‌ లకు బ్యాంక్ వెల్లడించింది.

పీఎన్‌బీ తాజాగా కనుగొన్న ఎల్‌ వోయూల్లో గీతాంజలి గ్రూప్ సంస్థలకు సంబంధించి మొత్తం రూ.1,251 కోట్ల విలువైన ఎల్‌ వోయూలున్నట్లు సీబీఐ ధ్రువీకరించింది. ఈ నేప‌థ్యంలో పీఎన్‌ బీ స్కాం విచారణలో భాగంగా ప్రముఖ న్యాయ సేవల సంస్థ సిరిల్ అమర్‌ చంద్ మంగళ్‌ దాస్ (సీఏఎం) కార్యాలయంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. ముంబై ఆఫీసులో జరిగిన ఈ తనిఖీల్లో నీరవ్ మోడీకి సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పీఎన్‌ బీ కుంభకోణం వెలుగు చూడటానికి కొద్ది వారాల ముందు నీరవ్ జరిపిన ఓ బ్యాంకింగ్ ఆధారిత లావాదేవీని సీఏఎం పర్యవేక్షించింది. సీఏఎంకు నీరవ్ కొత్త క్లయింట్ అవగా - పీఎన్‌ బీ మోసం నేపథ్యంలో ఆయన ఖాతాను సీఏఎం తొలిగించింది. మరోవైపు సీబీఐ సోదాల్ని సీఏఎం ఖండించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ - టాటా గ్రూప్ - ఎస్‌ బీఐ వంటి అగ్రశ్రేణి ప్రభుత్వ - కార్పొరేట్ సంస్థలకు న్యాయ సలహాల్ని - సహాయాన్ని అందించే తమపై అనుమానం బాధాకరమని పేర్కొంది.

పీఎన్‌ బీ స్కాం ప్రధాన సూత్రధారి - వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి చెందిన ఫైర్‌ స్టార్ డైమండ్ సంస్థ.. అమెరికాలో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఈ సంస్థ లిస్టింగ్ ఆస్తులు - ఇతరత్రా 100 మిలియన్ డాలర్ల మేర ఉన్నాయని న్యూయార్క్ దక్షిణ జిల్లాలోని ఓ కోర్టు పేర్కొంది. అమెరికాతోపాటు - ఐరోపా - మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఫైర్‌ స్టార్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కాగా, నకిలీ ఎల్‌ వోయూలు - ఎల్‌ వోసీలపై నీరవ్ మోడీ పీఎన్‌ బీని వేల కోట్లు ముంచగా, ఈ ఏడాది ఆరంభంలోనే దేశం విడిచి పారిపోయినది తెలిసిందే. మరోవైపు పీఎన్‌ బీ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. నీరవ్‌ పై నాన్ బెయిలబుల్ వారెంట్ కోసం కోర్టుకు వెళ్లగా, పన్ను ఎగవేత కేసులో మరో కోర్టు నీరవ్‌ కు సమన్లు జారీ చేసింది.