Begin typing your search above and press return to search.

పోచారం సాబ్..మరి కేసీఆర్ సారు అలా మాట్లాడిండే?

By:  Tupaki Desk   |   29 Sep 2019 5:26 AM GMT
పోచారం సాబ్..మరి కేసీఆర్ సారు అలా మాట్లాడిండే?
X
అద్భుతమైన స్టేట్ మెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు. అప్పుడప్పుడు ఆణిముత్యాల్లాంటి మాటల్ని అధినేత దగ్గర నుంచి ఆపార్టీకి చెందిన నేతలు పలువురు చెబుతుంటారు. ఈ మధ్యనే కేసీఆర్ మాట్లాడుతూ.. తన కలల ప్రాజెక్టు కాళేశ్వరంపై లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ తప్పు పట్టిన తీరును ప్రస్తావిస్తూ.. అసలు ఆయన ఎవరండి? తెలంగాణతో ఆయనకున్న సంబంధం ఏమిటి? ఆయనెలా విమర్శిస్తారంటూ ఉగ్రరూపాన్ని ప్రదర్శించారు.

తెలుగు ప్రాంతాలకు సంబంధించి.. అద్బుతమైన మేధోతనం నిండిన అతి కొద్దిమందిలో ఆయన ఒకరు. అలాంటి ఆయనకు ప్రాంతీయ ముద్రను వేసేశారు గులాబీ బాస్. ఇలా మాట్లాడే కేసీఆర్ తీరుకు భిన్నంగా.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ స్పీకర్ పదవిలో ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి ఆసక్తికర రీతిలో వ్యాఖ్యలు చేశారు. 64వ కామన్ వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు ఆయన ఉగాండా రాజధాని కంపాలకు చేరుకున్నారు.

ప్రపంచంలో దేశం ఏదైనా సరే.. అక్కడ తెలుగువారు తప్పక ఉంటారన్న మాటను నిజం చేస్తూ.. కంపాలాకు వెళ్లిన పోచారం మాష్టార్ని ప్రవాస తెలుగువాళ్లు ఘనస్వాగతం పలికారు. రెండు తెలుగు రాష్ట్రాలు.. అమెరికాలో మినహాయిస్తే.. మిగిలిన దేశాల్లో ఉండే ప్రవాస తెలుగువారి మధ్య ఆంధ్రా.. తెలంగాణ ఫీలింగ్ తక్కువ. తెలుగోళ్లమన్న భావనే ఎక్కువని చెబుతుంటారు. ఈ విషయం పోచారం లాంటోళ్లకు తెలీదా?

అందుకేనేమో.. కంపాలకు వెళ్లిన పోచారం.. అక్కడి పరిస్థితులకు తగ్గట్లే ఆసక్తికర వ్యాక్యలుచేశారు. తెలంగాణ ఉద్యమంలో రెండు రాష్ట్రాల్లోని తెలుగువారి మధ్య విభేదాలు పెంచేందుకు పలు రాజకీయ పార్టీలు ప్యత్నించినా వారి కుట్రలు ఫలించలేదన్నారు. భౌగోళికంగా ఆంధ్రా.. తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినా.. తెలుగువారి మధ్య ఉన్న ఆత్మీయ సంబంధాలు తెగిపోలేదంటూ అద్భుతమైన వ్యాఖ్యలు చేశారు. అన్ని బాగున్నాయి సరే.. మరి తెలంగాణ ముఖ్యమంత్రి సాబ్ అప్పుడెప్పుడు ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లు అంటూ అలా ఎలా మాట్లాడేస్తారు పోచారం మాష్టారు?