Begin typing your search above and press return to search.

ప్రాణాలు తీసిన పేకాట.. ఇంజినీర్‌ ఆత్మహత్య

By:  Tupaki Desk   |   11 Oct 2021 6:08 AM GMT
ప్రాణాలు తీసిన పేకాట..  ఇంజినీర్‌ ఆత్మహత్య
X
సరదా కోసమో లేక సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యమో కానీ ఆన్ లైన్ గేమ్స్‌ కు ఇటీవల విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీనికి తోడు లాక్‌ డౌన్ పుణ్యమా అని ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లుగా సాగుతోంది. అయితే, ఇలాంటి వాటిని ఆడొద్దు..ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని పోలీసులు, ఇతరులు ఎంత మొత్తుకొని చెబుతున్నా జనం పట్టించుకోవడం లేదు. ఆన్ లైన్ గేమ్స్ మోజులో లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ఫలితంగా అప్పుల బాధతో తనువు చాలిస్తున్నారు. వారు చనిపోవడమే కాకుండా కుటుంబసభ్యులను కూడా ఆత్మహత్య చేసుకొనే పరిస్థితిని కల్పిస్తున్నారు. తాజాగా ఇదే తరహా ఘటన తిరుపత్తూరు జిల్లా వానియంబాడిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే .. ఆన్‌లైన్‌ రమ్మీకి బానిసై రూ. 10 లక్షల నగదును పోగొట్టకోవడంతో.. జీవితంపై విరక్తి చెంది చెన్నై ఐటీ ఇంజినీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తిరుపత్తూరు జిల్లా వానియంబాడిలో వెలుగులోకి వచ్చింది. కాటుకొల్లై గ్రామానికి చెందిన ఆనందన్‌ చెన్నైలోని ఐటీ కంపెనీలో ఇంజినీర్‌ గా పనిచేస్తున్నాడు. ఇతడు ఆన్‌ లైన్‌ ద్వారా సెల్‌ ఫోన్‌ లో రమ్మీకి బానిస అయ్యాడు. కుటుంబ సభ్యులు ఖండించారు. అయినప్పటికీ రమ్మీ ఆడేవాడు. గత వారంలో మాత్రం ఆన్‌లైన్‌ రమ్మీ ఆడి రూ. 10 లక్షల నగదు పోగొట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో స్నేహితుల వద్ద రూ. 6 లక్షల అప్పు కూడా ఉంది.

ఇదిలా ఉండగా స్థానిక ఎన్నికల ఓటు వేసేందుకు ఆనందన్‌ సొంత గ్రామమైన కాట్టుకొల్లై గ్రామానికి మూడు రోజుల క్రితం వచ్చాడు. శనివారం ఓటు హక్కు వినియోగించుకొని ఇంటిలో ఉన్నాడు. ఆ సమయంలో ఆనందన్‌ ఆన్‌లైన్‌ రమ్మీ ద్వారా భారీగా నగదు పోగొట్టుకున్న విషయం తెలిసింది. దీంతో తల్లిదండ్రులు మందలించారు. మనోవేదనకు గురై ఆనందన్‌ ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం ఆనందన్‌ రూం నుంచి బయటకు రాక పోవడంతో కుటుంబ సభ్యులు కిటికీల ద్వారా చూడా ఆనందన్‌ మృతి చెంది ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.