Begin typing your search above and press return to search.

తినేది అన్నం ముద్ద కాదు.. విష‌మ‌ట‌

By:  Tupaki Desk   |   4 Nov 2017 5:10 AM GMT
తినేది అన్నం ముద్ద కాదు.. విష‌మ‌ట‌
X
పాల‌కుల పాపం ప్ర‌జ‌ల పాలిట శాపంగా ఎలా మారుతుందో చెప్పే వైన‌మిది. నిలువెత్తు నిర్ల‌క్ష్యం.. ప్ర‌జ‌ల ఆరోగ్యం మీద ప‌ట్ట‌ని త‌త్త్వం ఇప్పుడు ప్ర‌జ‌ల‌కే కాదు పాల‌కుల‌కు సైతం అదిరిపోయే మాట ఇది. నిత్యం తినే కూర‌గాయ‌ల్లో కాల‌కూట విషం దాగుంద‌న్న విష‌యాన్ని వెల్ల‌డించింది జాతీయ మొక్క‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ సంస్థ‌.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ సేక‌రించిన శాంపిల్స్ లో ప‌రిమితికి మించిన పురుగుమందుల అవ‌శేషాలు ఉన్న‌ట్లుగా వెల్ల‌డించింది. అది హైద‌రాబాద్ కావొచ్చు.. అమ‌రావ‌తి కావొచ్చు. రెండు రాష్ట్రాల్లోని రైతులంతా అవ‌గాహ‌న లేమితో ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్న పురుగుమందులు.. కూర‌గాయ‌ల‌తో పాటు ఎంచ‌క్కా ప్ర‌జ‌ల పొట్టల్లోకి వెళ్లి స్టాక్ అయిపోతుంద‌ట‌. కూర‌గాయ‌ల ఉత్ప‌త్తుల్లో పెరుగుతున్న పురుగుమందుల అవ‌శేషాల స్థాయి ఎంత‌లా ఉంద‌న్న విష‌యం ఈ సంస్థ చేసిన ప‌రీక్ష‌ల్లో వెల్ల‌డైంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అమ్మే కూర‌గాయ‌ల్లోనూ ఈ పురుగుమందు అవ‌శేషాలు భారీగా ఉన్న‌ట్లుగా తేలింది. హైద‌రాబాద్ గుడిమ‌ల్కాపూర్ మార్కెట్లో సేక‌రించిన వంకాయ‌ల్లో క్లోరాన్ ట్ర‌నిల్ ప్రోల్ అనే మందు ప‌రిమితి మించి 17 రెట్లు అధికంగా ఉన్న‌ట్లు జులైలో నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో తేలింది. ఒక్క గుడిమ‌ల్కాపూర్ మాత్ర‌మే అనుకుంటే త‌ప్పే. ఎందుకంటే ఈ సంస్థ మెహ‌దీప‌ట్నం.. బంజారాహిల్స్‌.. మైల‌దేవ‌ర‌ప‌ల్లి.. ష‌హీన్ న‌గ‌ర్‌.. పెద్ద గోల్కొండ‌.. శంషాబాద్ ప్రాంతాల్లోని మార్కెట్ల నుంచి గ‌త ఏడాది డిసెంబ‌రులో 50 ప‌చ్చి మిర్చి న‌మూనాల్ని తీసి ప‌రీక్షించాయి. అందులో 25 క‌లుషితంగా ఉన్న‌ట్లు గుర్తించారు. వీటిల్లో ఏడు శాంపిల్స్ లో ప‌రిమితికి మించి ప‌రుగుమందుల అవ‌శేషాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

వంకాయ‌.. ప‌చ్చిమిర్చి మాత్ర‌మే కాదు.. వంట‌ల్లో త‌ప్ప‌నిస‌రిగా వాడే క‌రివేపాకులోనూ ఇలాంటి ప‌రిస్థితి. ఒక్క హైద‌రాబాద్ లో మాత్ర‌మే కాదు.. అమ‌రావ‌తి.. క‌ర్నూలుతో పాటు మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ సంస్థ నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ విష‌యాల‌న్ని వింటే భీతి క‌ల‌గ‌టంతో పాటు.. అస‌లేం తినాల‌న్న భ‌యం అవ‌హించ‌క మాన‌దు. అమెరికా.. యూరోపియ‌న్ దేశాల్లో ప‌రిమితికి మించిన పురుగుమందుల అవ‌శేషాలున్న ఆహారం వినియోగించ‌టాన్ని అస్స‌లు ఒప్పుకోరు. మార్కెట్లోకి వ‌స్తువు రావ‌టానికి ముందే ప‌క్కా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. కానీ.. మ‌న ద‌గ్గ‌ర అలాంటి ప‌రిస్థితి లేక‌పోవ‌టంతో కాల‌కూట విష‌యాన్ని కూర‌గాయ‌ల రూపంలో తినేస్తున్న దుస్థితి.

కూర‌గాయ‌ల్లో ర‌సాయ‌న అవశేషాలు ఉన్నాయా? లేదా? అన్న విష‌యాన్ని తేల్చేందుకు జాతీయ మొక్క‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ సంస్థ ఉన్న‌ప్ప‌టికీ.. కొన్ని శాంపిల్స్ సేక‌రించి ప‌లితాల్ని వెల్ల‌డించ‌టం త‌ప్పించి మ‌రింకేమీ చేయ‌టం లేదు.
మొద్దుబారిపోయిన పాల‌కుల పుణ్య‌మా అని.. ఇలాంటి విష‌యాల్ని ప‌ట్టించుకునే తీరిక వారికి లేదు. విషాద‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. త‌మ నిర్ల‌క్ష్యం ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే కాదు త‌మ‌కు.. త‌మ కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌మాద‌క‌రంగా వాటిల్లింద‌న్న విష‌యాన్ని తెలుసుకోక‌పోవ‌ట‌మే. మోతాదుకు మించిన పురుగుమందుల అవ‌శేషాలు కూర‌గాయ‌ల్లో ఎందుకు ఉంటున్నాయ‌న్న విష‌యంలోకి వెళితే.. కూర‌గాయ‌ల్ని పండించే రైతుల‌కు ఏ పురుగు మందును ఎంత వాడాల‌న్న అవ‌గాహ‌న త‌క్కువ‌. దీనికి తోడు రైతులు వాడే పురుగుమందుల మీద అధికారుల నియంత్ర‌ణ త‌క్కువ‌. అన్నింటికి మించి రైతుల అవ‌గాహ‌న లేమి పుణ్య‌మా అని మోతాదుకు మించిన ర‌సాయ‌నాలు క‌డుపులోకి వెళ్లిపోతున్నాయి.

పంట కోయ‌టానికి ముందు రోజు కూడా పురుగుమందులు జ‌ల్లే వారు లేక‌పోలేరు. ఎందుకిలా అంటే.. పురుగు మందులు కొట్టిన త‌ర్వాత ప‌క్క‌రోజు మంచుకు పురుగుమందు అవ‌శేషాలు తుడిచిపెట్టుకుపోతాయంటూ రైతులు అమాయ‌కంగా ప్ర‌శ్నిస్తున్న తీరు న‌వ్వాలో.. ఏడ‌వాలో అర్థం కాదు. వారికి అర్థ‌మ‌య్యేలా చెప్పాల్సిన అధికారులు.. వారి చేత ప‌ని చేయించుకోవాల్సిన ప్ర‌భుత్వాలు నిర్ల‌క్ష్య నిద్ర‌లో మునిగిపోయిన‌ప్పుడు విషాన్ని ఆహారంగా తీసుకోవ‌టం మిన‌హా ఇంకేం చేయ‌గ‌లం?