Begin typing your search above and press return to search.

ఈ పోకెమాన్ పిచ్చేందిరా నాయనా

By:  Tupaki Desk   |   19 July 2016 4:52 PM GMT
ఈ పోకెమాన్ పిచ్చేందిరా నాయనా
X
కొత్తొక వింతలా తయారైంది. రోటీన్ కి భిన్నంగా ఏం కనిపించినా ఎగబడే జనాలు ఈ మధ్యనే ఎక్కువే అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న పోకెమాన్ గో గేమ్ ఇప్పుడు తన హవాను భారత్ ను పట్టేసింది. వర్చువల్ రియాలిటీ గేమ్ అయిన దీని కోసం ఆ మధ్యన న్యూయార్క్ మహానగరంలో జనాలు ప్రవాహంలా రోడ్ల మీదకు రావటం.. దీంతో ట్రాఫిక్ జాం కావటం తెలిసిందే. ఒక మొబైల్ గేమ్ ఆడటం కోసం రోడ్ల మీదకు జనాలు వచ్చేయటం.. ట్రాఫిక్ జాం కావటమే కాదు.. ఈ గేమ్ ఆడేందుకు కొందరు ఉద్యోగాలు సైతం రిజైన్ చేసేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

న్యూయార్క్ లో మాదిరే తాజాగా చెన్నైలోని అన్నా టవర్ పార్క్ లో స్మార్ట్ ఫోన్లను పట్టుకొని పోకెమాన్ ల కోసం పిచ్చ.. పిచ్చగా తిరగటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇలా తిరిగేవాళ్లలో చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా అందరూ ఉండటం ఒక విశేషంగా చెప్పాలి. నియాంటిక్ కంపెనీ రూపొందించిన ఈ వర్చువల్ రియాలిటీ గేమ్ లో అంత మజా ఏమిటన్న విషయానికి వెళితే.. స్మార్ట్ ఫోన్ లో ఈ గేమ్ ను ఓపెన్ చేసి బయటకు వస్తే.. జీపీఎస్ ఆధారంగా ఇది దగ్గర్లోని ఒక ప్రాంతాన్ని చూపిస్తుంది. అలా నడుచుకుంటూ ఆ ప్రాంతానికి వెళితే.. పోకే బాల్ తో వాటిని కొట్టేసి సొంతం చేసుకోవాలి. ఇలా గేమ్ లో వివిధ లెవెల్స్ ఉంటాయి. గేమ్ ఆడే వారికి దగ్గర్లో ఉండేలా డిజైన్ చేయటం.. వాటిని సరదాగా పట్టుకోవచ్చన్న ఉత్సాహంతో రోడ్ల మీదకు రావటం.. గంటల తరబడి ఈ ఆటతో ఎంగేజ్ కావటం ఇప్పుడో ట్రెండ్ గా మారింది. ఆట కోసం చెన్నై పార్కులో ప్రవాహం వస్తున్న జనాలకు సంబంధించిన ఒక వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పరిస్థితి.