Begin typing your search above and press return to search.
బాబు అదేశాలిచ్చినా ఆఫీసర్లు డోంట్ కేర్
By: Tupaki Desk | 13 Jan 2017 4:34 PM GMTపోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల అట్టహాసంగా జరిగిన కార్యక్రమం గుర్తుండే ఉంటుంది. డిసెంబర్ 30న స్పిల్‌వే కాంక్రీటు పనులు ప్రారంభోత్సవం సందర్భంగా సభలో సీఎం నిర్వాసితులకు కొత్త చట్టం వర్తింపజేస్తామని చెబితే అధికారులు మాత్రం దీనికి పూర్తి రివర్స్ లో వెళుతున్నారు. ఏకంగా జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఉన్న అధికారులే కాదు కూడదని తేల్చిచెప్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు నిర్వాసితులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా భూములు కోల్పోయిన వారు తమకు 2013 భూసేకరణ చట్టం వర్తింపచేయాలని కోరారు. అయితే 2013 భూసేకరణ చట్టం పోలవరం నిర్వాసితులకు వర్తించదని తేల్చి చెప్పారు. దీంతో నిర్వాసితులంతా భగ్గుమనడంతో సభ రసాభసాగా మారింది.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సైతం 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు కోరారు. అయితే ఏపీ సర్కారు ఇందుకు నో చెప్పింది. తమ డిమాండ్ల సాధనలో భాగంగా దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 7న నిర్వాసితులంతా ప్రాజెక్టు పనులను అడ్డుకోవడంలో భాగంగా రోడ్లు దిగ్బంధం చేశారు. దీంతో ఈ నెల 12న అన్ని శాఖల అధికారులతో బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జంగారెడ్డిగూడెం ఆర్‌డీఒ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. అందులో భాగంగా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు, ఐటిడిఎ పీఓ, ఆర్‌డీఓ ఆధ్వర్యాన అన్నిశాఖల అధికారులతో చేగొండపల్లి కాలనీలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాసితులు తమ కాలనీల్లోని డ్రెయినేజీ, రోడ్లు, శ్లాబుల లీకేజీ, తాగునీరు వంటి సమస్యలను అధికారుల ముందుపెట్టారు. ఆ సమస్యలను పరిష్కరిస్తామంటూ సానుకూలంగా మాట్లాడిన అధికారులు భూమికి భూమి, పరిహారం విషయం వచ్చేసరికి 2013 భూసేకరణ చట్టం వర్తించదని స్పష్టం చేశారు. దీంతో షాక్ తిన్న నిర్వాసితులు డిసెంబర్ 30న స్పిల్‌వే కాంక్రీటు పనులు ప్రారంభోత్సవం సందర్భంగా సభలో సీఎం చంద్రబాబు నిర్వాసితులకు కొత్త చట్టం వర్తింపజేస్తామని చెబితే అధికారులు వర్తించదని చెప్పడంపై నిర్వాసితులు గట్టిగా నిలదీశారు. సరైన సమా ధానం చెప్పకుండా అధికారులు మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. దీనిపై నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 భూసేకరణ చట్టం వర్తింపజేయకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/