Begin typing your search above and press return to search.

పోలవరంపై కేంద్రానికి ఫిర్యాదు

By:  Tupaki Desk   |   17 Jan 2018 6:03 PM GMT
పోలవరంపై కేంద్రానికి ఫిర్యాదు
X
ఏపీ సీఎం చంద్రబాబు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టు ఆయనకు నిత్యం నెత్తి నొప్పులు తెస్తోంది. తాజాగా కేంద్రానికి ఈ ప్రాజెక్టుపై ఫిర్యాదులు అందాయి. ప్రధానంగా ఈ ప్రాజెక్టులో అక్రమాలు జరుగుతున్నాయంటూ సాక్ష్యాలతో సహా ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ అందిందట. రాజమండ్రికి చెందిన జె. చౌదరయ్య అనే రిటైర్డ్ లెక్చరర్ ఈ ఫిర్యాదు చేశారు. పరిహారం పేరుతో టీడీపీ నేతలు వేల కోట్లు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నది ఆయన ప్రధాన ఆరోపణ.

కాగా చౌదరయ్య ఈ లేఖను ఆషామాషీగా రాయలేదని.. ఆధారాలతో సహా - డాక్యుమెంట్లను జోడించి మరీ కేంద్రానికి చేరవేశారని సమాచారం. 2005లో పోలవరం కుడి కాలువ పనులను అడ్డుకునేందుకు చంద్రబాబే టీడీపీ సానుభూతిపరులైన రైతులతో కోర్టులో కేసులు వేయించారని… ఇప్పుడు తాను అధికారంలోకి రాగానే పట్టిసీమ కోసం వెంటనే సదరు రైతులతో కేసు వెనక్కు తీసుకునేలా చేశారని ఆయన తన లేఖలో ఆరోపించారు.

అయితే... కేసులు వెనక్కు తీసుకున్న తన అనుకూల రైతులకు అత్యధికంగా ఎకరాకి 52 లక్షల 91వేల రూపాయలను చంద్రబాబు అందజేశారని వివరించారు ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. కుడి కాలువలో భూసేకరణ చట్టం–2013 కంటే ఎక్కువ పరిహారం ఇచ్చారన్నారు. అదే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కింద మాత్రం ఎకరాకు 28లక్షలు మాత్రమే ఇస్తామంటోందని.. దీనిపై రైతులు కోర్టుకు వెళ్లగా వారిపై కక్ష కట్టి కేవలం 17. 91లక్షలు మాత్రమే ఇస్తోందని ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. పోలవరం ముంపు బాధితులకు మరీ తక్కువగా కేవలం 10.5లక్షలు మాత్రమే ఇస్తున్నారని వివరించారు. ఒకే ప్రాజెక్టులో ఇలా వివక్ష ఎందుకు చూపుతున్నారన్నది చెప్పాలని... రైతులందరికీ న్యాయం చేయాలని ఆయన తన లేఖలో రాశారు. కాగా కేంద్రం దీనిపై వివరణ కోరే అవకాశం ఉందని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్పాలా అని టెన్షన్ పడుతోందట.