Begin typing your search above and press return to search.

ఇదో పిచ్చ ఛాలెంజ్‌..ద‌య‌చేసి ఎవ‌రూ ట్రై చేయొద్దు

By:  Tupaki Desk   |   1 Aug 2018 7:31 AM GMT
ఇదో పిచ్చ ఛాలెంజ్‌..ద‌య‌చేసి ఎవ‌రూ ట్రై చేయొద్దు
X
ప్రపంచం ఓ చిన్న కుగ్రామంలా మారిందన్న మాట ఆ మ‌ధ్య‌న వినిపిస్తే ఏమో అనుకున్నాం కానీ.. ఇప్పుడు అంద‌రికి అర్థ‌మ‌వుతూనే ఉంది. ప్రపంచంలో ఏ మారుమూల ఏం జ‌రిగినా ఆ వెంట‌నే దాని ప్ర‌భావం అంద‌రి మీదా ప‌డుతున్న ప‌రిస్థితి. అంతేనా.. కాస్త ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు కూడా సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని క్ష‌ణాల్లో వైర‌ల్ అయిపోతున్న ప‌రిస్థితి. దీని కార‌ణంగా మంచి ఎంతో... అంత‌కు రెట్టింపు చెడు కూడా జ‌రుగుతోంది.

ఇటీవ‌ల కాలంలో కొన్ని అంశాల్లో చైత‌న్యం కోసం.. ప్ర‌జ‌ల్లో మార్పు తీసుకురావ‌టం కోసం ఛాలెంజ్ లు చేసుకోవ‌టం.. వాటిని త‌మ‌కు న‌చ్చిన వారికి స‌వాల్ చేయ‌టం.. వారి చేత చేయించి.. మ‌ళ్లీ వారు మ‌రికొంద‌రికి స‌వాల్ విస‌ర‌టం జ‌రుగుతోంది. ఈ ఛాలెంజ్ ల క్ర‌మంలో ఇప్ప‌టికే ప‌లు కార్య‌క్ర‌మాలు చోటు చేసుకున్నాయి. మంచివి ఉన్న‌ట్లే.. కొంప‌లు ముంచేవీ ఉన్నాయి. తాజాగా అలాంటి పిచ్చ స‌వాల్ ఒక‌టి ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

ఈ క‌థ‌నం ఇచ్చే ఉద్దేశం కేవ‌లం.. అలాంటి పిచ్చ స‌వాళ్ల జోలికి వెళ్లి ప్ర‌మాదాల‌కు గురి కావొద్ద‌ని చెప్ప‌ట‌మే. ఎవ‌రికి వారికి కుటుంబాలు.. ప్ర‌తి ఒక్క‌రిని న‌మ్ముకొని.. వారి మీద‌నే ప్రాణం పెట్టుకొనేటోళ్లు చాలామందే ఉంటారు. అలాంటి వారిని పిచ్చ హీరోయిజం ప్ర‌ద‌ర్శించే క్ర‌మంలో క‌ష్ట‌పెట్ట‌టం మూర్ఖ‌త్వమ‌న్న విష‌యాన్ని చెప్ప‌టమే ఈ క‌థ‌నం అస‌లు ఉద్దేశం.

ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గా.. కిక్ ఎక్కించేలా ఉండాల‌నుకునే యూత్ తీరుకు త‌గ్గ‌ట్లు కొన్ని పిచ్చ పిచ్చ అంశాలు కూడా తెర మీద‌కువ‌స్తుంటాయి. తాజాగా అలా వ‌చ్చిందే కీకీ చాలెంజ్‌. ఈ డ్యాన్స్ ఛాలెంజ్ ఇప్పుడు క్రేజీగా మారింది. అయితే.. ఈ ఛాలెంజ్ కుటుంబ స‌భ్యుల‌కు.. పోలీసుల‌కు కొత్త త‌ల‌నొప్పుల్ని తెచ్చి పెడుతోంది. ఇంత‌కీ.. ఈ పిచ్చ ఛాలెంజ్ ఎలా స్టార్ట్ అయ్యిందంటే.. కెన‌డాకు చెందిన సింగ‌ర్ డ్రెక్ ఇన్ మై ఫీలింగ్స్ అనే పాట‌కు డాన్స్ చేస్తూ జ‌నాలు స్ట‌న్ అయ్యేలా చేసింది.

అంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. మ‌రింత కొత్త‌గా ఉండేందుకు క‌దులుతున్న కారులో నుంచి దిగి.. దాని ముందు డ్యాన్స్ చేయ‌టం.. ఆ త‌ర్వాత కారులోకి జంప్ చేస్తుంది. ఇది న‌చ్చిన కొంద‌రు పిచ్చ‌గాళ్లు.. కీకీ ఛాలెంజ్ పేరుతో న‌చ్చినోళ్ల‌కు విసురుతున్నారు. ఇది ప్ర‌మాద‌క‌ర‌మైన విన్యాస‌మే కాదు.. ప్రాణాల మీద‌కు తెస్తుంది కూడా.

ఈ ఛాలెంజ్ దెబ్బ‌కు కుటుంబ స‌భ్యులు భ‌యంతో వ‌ణుకుతున్నారు. ఈ ఛాలెంజ్ నుస్వీక‌రించి ప్ర‌మాదాల బారిన ప‌డిన వాళ్ల‌కు కొద‌వ లేదు. దీంతో.. వైర‌ల్ అవుతున్న ఈ ఛాలెంజ్ ను కంట్రోల్ చేసేందుకు వివిధ దేశాల‌కు చెందిన పోలీసులు కిందా మీదా ప‌డుతున్నారు.

ఇంగ్లాండ్‌.. స్పెయిన్.. మ‌లేషియా.. సౌదీ అరేబియాతోపాటు ప‌లు దేశాల్లోని పోలీసులు.. కీకీ ఛాలెంజ్ ను స్వీక‌రించొద్ద‌ని కోరుతున్నార‌ట‌. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా మ‌న దేశంలోని ముంబ‌యి.. యూపీ పోలీసులు ముందుస్తుగా ఈ ఛాలెంజ్ ను ఎవ‌రూ స్వీక‌రించొద్దంటూ ప్ర‌చారం చేస్తున్నారు. సో.. న‌లుగురిలో మంచిని పెంచేవి.. చుట్టూ ఉన్న ప‌ర్యావ‌ర‌ణానికి.. ప్ర‌జ‌ల‌కు మేలు చేసే ఛాలెంజ్ ల‌ను స్వీక‌రించ‌టంలో అర్థం ఉంటుంది కానీ.. కీకీ లాంటి పిచ్చ వాటి జోలికి వెళ్ల‌కుండా ఉండ‌టం చాలా అవ‌స‌రం.