Begin typing your search above and press return to search.

పోలీస్ దొంగలు.. 50 లక్షలు కొట్టేశారు

By:  Tupaki Desk   |   27 April 2019 9:36 AM GMT
పోలీస్ దొంగలు.. 50 లక్షలు కొట్టేశారు
X
ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన బాధ్యత గల పోలీసులే దొంగలుగా మారిపోయారు. నెల్లూరు జిల్లా గూడురు వద్ద ఇటీవల రైలులో జరిగిన దోపిడీ కేసులో నలుగురు పోలీసుల పాత్ర ఉన్నట్లు రైల్వే అధికారులు గుర్తించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఓ వ్యక్తిని బెదిరించి రూ.50 లక్షలు చోరీ చేసిన కేసుకు సంబంధించిన వివరాలను రైల్వే డీఎస్పీ జి.వసంతకుమార్‌ మీడియాకు వెల్లడించారు.

కావలిలోని పీఎంఆర్‌ సిల్వర్‌ ప్యాలెస్‌ లో పనిచేసే అనిత, మరో యువతితో కలిసి రూ.50 లక్షల విలువైన బంగారం కొనుగోలు చేసేందుకు ఏప్రిల్ 15న చెన్నైకు వెళ్లారు. అయితే, ఆ సొమ్మును కాజేయడానికి అనిత తన ప్రియుడితో కలిసి పథకం వేసింది. దీనికి రవి తన స్నేహితులైన ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక ఇన్‌ స్పెక్టర్‌ స్థాయి అధికారి సాయం తీసుకున్నాడు. పథకం ప్రకారం వీరంతా గూడూరు రైల్వే స్టేషన్‌లో అనిత నుంచి ‘పన్ను చెల్లించని సొమ్ము స్వాధీనం చేసుకుంటున్నామని’ చెప్పి నగదుతో ఉడాయించారు.

ఈ ఘటనపై గూడూరు పోలీస్‌ స్టేషన్‌ లో అనిత ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదుచేసిన నెల్లూరు రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. కేసు విచారణలో అనితే తన ప్రియుడితో కలిసి నగదు కొట్టేయడానికి పథకం వేసినట్టు తేలింది. ఈ కేసులో అనితతోపాటు ఆమె ప్రియుడు రవిని అరెస్టు చేసిన రైల్వే పోలీసులు రూ.17 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు వెంకటగిరి 9వ బెటాలియన్‌ కు చెందిన కానిస్టేబుళ్లు మహేష్‌, సుల్తాన్‌ బాషా, సుమన్‌ కుమార్‌, ఎస్డీఆర్‌ ఎఫ్‌ ఆర్‌ ఐ ఉన్నారని పేర్కొన్నారు. పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వీరిని పట్టుకుంటామని రైల్వే డీఎస్పీ తెలియజేశారు. అయితే.. ఈ దొంగ పోలీసులు గతంలోనూ ఇలాంటి దోపిడీలకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.