Begin typing your search above and press return to search.

విశాఖ పర్యటనలో హైడ్రామా..చంద్రబాబు అరెస్టు

By:  Tupaki Desk   |   27 Feb 2020 1:15 PM GMT
విశాఖ పర్యటనలో హైడ్రామా..చంద్రబాబు అరెస్టు
X
తన స్వలాభం కోసం - ప్రచారం కోసం ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకు ఘోర పరాభవం ఎదురైంది. బాబు పర్యటనను నిరసిస్తూ ఉత్తరాంధ్ర వాసులు - వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు దిగారు. బాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. విశాఖ విమానాశ్రయం దగ్గర దాదాపు 5 వేలమంది విశాఖ వాసులు - వైసీపీ కార్యకర్తలు బాబును అడ్డుకున్నారు. స్థానికుల నిరసనతో చంద్రబాబు కాన్వాయ్‌ ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో, బాబు తిరిగి వెనక్కివెళ్లాలని పోలీసులు సూచించారు. అయితే, తన పర్యటనకు అనుమతులున్నాయని - తాను పర్యటించి తీరతనని బాబు మొండిపట్టు పట్టారు. దాదాపు 5 గంటలపాటు పోలీసులతో విశాఖ ఎయిర్ పోర్టు ముందు బాబు హైడ్రామా నడిపారు. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ....వాదనకు దిగారు. తమాషా చేస్తున్నారా..అంటూ పోలీసులపైకి బెదిరింపులకు దిగారు. ఎట్టకేలకు పోలీసులు....చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు.

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విశాఖ విమానాశ్రయం దగ్గర హైడ్రామా నడిచింది. బాబు పర్యటనను అడ్డుకునేందుకు విశాఖ వాసులు - వైసీపీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో భద్రత కారణాల రీత్యా పర్యటన విరమించుకోవాలని పోలీసులు చెప్పినా బాబు వినలేదు. దీంతో, భద్రతా కారణాల రీత్యా ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నామని బాబుకు విశాఖ పశ్చిమ మండలం ఏసీపీ నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న తర్వాత చంద్రబాబును అరెస్ట్ చేసి ఎయిర్ పోర్టులోని వీఐపీ లాంజ్ కు తరలించారు. విమానాశ్రయం వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో చంద్రబాబును మళ్లీ బయటికి పంపకపోవచ్చని తెలుస్తోంది. అయితే, బాబును విజయవాడ పంపించేస్తారా లేక హైదరాబాద్ తరలిస్తారా అనే విషయంపై స్పష్టత రాలేదు.