Begin typing your search above and press return to search.

ఆంధ్ర‌లో ప్ర‌జాస్వామ్యం ఉందా?:బొత్స

By:  Tupaki Desk   |   13 Aug 2018 8:23 AM GMT
ఆంధ్ర‌లో ప్ర‌జాస్వామ్యం ఉందా?:బొత్స
X
చేతిలో అధికారం....క‌నుసైగ చేస్తే క్ష‌ణాల్లో ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను అరెస్టు చేసే పోలీసులు....త‌మ‌కు అనుకూలంగా వార్త‌లు రాసే ఎల్లో మీడియా.....న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్రజాస్వామ‌న్ని ఘూనీ చేయ‌డానికి టీడీపీ ప్ర‌భుత్వానికి ఇంత‌క‌న్నా ప్ర‌త్యేక‌మైన ఆయుధాలు అవ‌స‌రం లేద‌ని ఎన్నో మార్లు స్ప‌ష్ట‌మైంది. వాస్త‌వాలను ఎలుగెత్తి చాటాల‌నుకున్న వైసీపీనేత‌ల‌ను గ‌తంలో ఎన్నోసార్లు త‌మ అధికారాన్ని ఉప‌యోగించి చంద్ర‌బాబునాయుడు అరెస్టు చేయించారు. తాజాగా, గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన అక్ర‌మ మైనింగ్ కుంభ‌కోణంలో మ‌రోసారి వైసీపీ గొంతు నొక్కేందుకు టీడీపీ సిద్ధ‌మైంది. అక్ర‌మ మైనింగ్ జ‌రిగిన ప్రాంతాన్ని సంద‌ర్శించేందుకు నేడు గుర‌జాల‌లో ప‌ర్య‌టించ‌నున్న వైసీపీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీని ప్ర‌భుత్వం అడ్డుకుంటోంది. గుర‌జాల చుట్టుప‌క్క‌ల చెక్ పోస్టులు పెట్టి మ‌రీ...అడ్డుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే వైసీపీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను పోలీసులు న‌డిరోడ్డుపై అడ్డుకొని అరెస్టు చేశారు. దీంతో, త‌నను అరెస్టు చేయింని టీడీపీ స‌ర్కార్ పై బొత్స నిప్పులు చెరిగారు. చంద్ర‌బాబు పాల‌న‌లో అస‌లు ఏపీలో ప్ర‌జాస్వామ‌య్యం ఉందా లేదా అని అనుమానం క‌లుగుతోంద‌ని బొత్స మండిప‌డ్డారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా గుర‌జాల‌ను పోలీసులు నిర్బంధించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు గురజాల వెళ్తున్న బొత్సను మంగ‌ళ‌గిరి స‌మీపంలోని కాజా టోల్‌గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. గురజాల వెళ్లేందుకు అనుమతి లేదని ఆయన‌తో వాగ్వాదానికి దిగారు. బొత్స‌తోపాటు గుంటూరు ఎమ్మెల్యే ముస్త‌ఫా, మార్కెట్ యార్డు మాజీ చైర్మ‌న్ లేళ్ల అప్పిరెడ్డిని దుగ్గిరాల పోలీస్‌ స్టేషన్ కు బ‌ల‌వంతంగా త‌ర‌లించారు. దీంతో, ఏపీ సీఎం చంద్ర‌బాబుపై బొత్స మండిప‌డ్డారు. గుంటూరు జిల్లా అంతా పోలీసులు నిర్భంధించార‌ని, గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని ఆయ‌న‌ అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదని, టీడీపీ ప్రభుత్వంలో కోర్టు - చట్టం - రాజ్యాంగమంటూ లేవని దుయ్య‌బ‌ట్టారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి నిర్బంధ‌ పరిస్థితి ఎప్పుడూ చూడలేదని అన్నారు. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో నిజాలు బ‌య‌ట‌పెట్టేందుకు గురజాల వెళుతున్నామ‌ని, అందుకే ప్రభుత్వం భ‌యప‌డుతోంద‌ని అన్నారు. జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేత‌ల అరెస్టుల‌ను ఆయ‌న ఖండించారు. మ‌రోవైపు, బొత్స అరెస్టు విష‌యం తెలుసుకున్న వైసీపీ కార్య‌క‌ర్త‌లు ....దుగ్గిరాల పోలీసు స్టేష‌న్ కు చేరుకున్నారు. స్టేష‌న్ ముందు ధ‌ర్నాకు దిగారు. పోలీసుల‌కు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. బొత్స‌తో పాటు మిగ‌తా నేత‌ల‌ను విడుద‌ల చేయాల‌ని నినాదాలు చేశారు. దీంతో, దుగ్గిరాల పోలీసు స్టేష‌న్ వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.