Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ వాళ్లు తగ్గట్లేదు.. టార్గెట్ 2024!

By:  Tupaki Desk   |   25 April 2019 1:30 PM GMT
కాంగ్రెస్ వాళ్లు తగ్గట్లేదు.. టార్గెట్ 2024!
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గట్టి దెబ్బే తగిలింది. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల ఫలితాల విషయంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ధీమాగా ఉంది. తామే మెజారిటీ ఎంపీ సీట్లను నెగ్గుతామనే ధీమాతో కనిపిస్తూ ఉంది ఆ పార్టీ. కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని ఆ పార్టీ వాళ్లు అంటున్నారు. అసలు కథ ఏమవుతుందో ఫలితాలు వస్తే కానీ తెలియదు.

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన ఎమ్మెల్యేలను కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తన వైపుకు తిప్పుకుంటోంది. ఇక తెలంగాణ సీఎల్పీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారట. ఒక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు సంబంధించిన లెజిస్ట్లేటివ్ విభాగాన్ని ఒక ప్రాంతీయ పార్టీలో విలీనం చేయడం చెల్లుతుందా? అనేది వేరే ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం ఆ పని చేయబోతోందట!

ఇలా వరస ఎదురుదెబ్బలు తగులుతున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం తగ్గడం లేదు. ఆ పార్టీ నేతలు మళ్లీ రోడ్డు ఎక్కారు. తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి ఆధ్వర్యంలో ఆ పార్టీ వాళ్లు నిరసన ప్రదర్శన జరపడం ఆసక్తిదాయకంగా ఉంది. ఇంటర్మీడియట్ బోర్డు వ్యవహారంలో - విద్యార్థుల ఆత్మహత్యలపై విజయశాంతి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారిని పోలీసులు తరిమి కొట్టారనుకోండి. ఈ ముట్టడిలో పాల్గొన్న కాంగ్రెస్ ముఖ్య నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఏదేమైనా ఒక నిఖార్సైన పాయింట్ ను కాంగ్రెస్ పార్టీ పట్టుకుంది.

ఇతర వ్యవహారాలు ఎలా ఉన్నా - ఇలాంటి విషయాల గురించి రాజకీయ పార్టీలు స్పందించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వాటికి పొలిటికల్ మైలేజ్ కూడా లభించే అవకాశాలున్నాయి. ఇదంతా చూస్తుంటే విజయశాంతి టార్గెట్ - 2024 పెట్టుకున్నట్టుగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. రాజకీయం సంగతెలా ఉన్నా, ఇలాంటి పోరాటాలే కాంగ్రెస్ పార్టీని ఉనికికి శరణ్యం!