Begin typing your search above and press return to search.

ఏపీ పోలీసులు ఇంత రాక్ష‌సులా?

By:  Tupaki Desk   |   17 Nov 2016 7:42 AM GMT
ఏపీ పోలీసులు ఇంత రాక్ష‌సులా?
X
పోలీసులు అంటే క‌ఠిన‌త్వానికి మారు పేరు అని తెలుసు. అయితే శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప‌రిర‌క్షించే క్ర‌మంలో వారి చ‌ర్య‌ల‌కు ఎవరైనా మ‌ద్ద‌తిస్తారు. కానీ వ్య‌క్తిగ‌త ఇగోల‌కు పోయి విచ‌క్ష‌ణార‌హితంగా వ్య‌వ‌హ‌రిస్తే ఎలా ఉంటుంది? ఈ పోలీసు బుద్ధి మార‌దు అనే అనిపిస్తుంది క‌దా! అలాంటి అభిప్రాయ‌మే క‌లిగేలా అనంత‌పురం పోలీసులు వ్య‌వ‌హ‌రించారు. అస‌లేం జ‌రిగిందంటే...పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ఇటీవ‌ల‌ అనంత‌పురంలో పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి ఆందోళ‌న నిర్వ‌హించారు. అదే స‌మ‌యంలో బ్యాంకు వ‌ద్ద ర‌ద్దీ - ఈ ఆందోళ‌న కార్య‌క్ర‌మం నేప‌థ్యంలో పోలీసులు బందోబ‌స్తు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో టూటౌన్ సీఐ శుభకుమార్‌ - ఆ స్టేషన్‌ ఎస్‌ ఐలు క్రాంతికుమార్‌ - జనార్దన్ లు ఓ వ్య‌క్తిని గొడ్డును బాదిన‌ట్లు బాదారు. ఈ అరాచ‌క చర్య తాలూకు వీడియో సోష‌ల్ మీడియాకు చేరి ర‌చ్చ ర‌చ్చ‌గా మారింది.

కాంగ్రెస్ ధ‌ర్నా నిర్వ‌హిస్తున్న ప్రాంతంలో ఓ వ్య‌క్తి రోడ్డుకు అడ్డంగా నిలుచొని ఉండ‌టంతో ఇక్కడ నిలబడొద్దని, పక్కకు తప్పుకోవాలని పోలీసులు సూచించారు. అయినప్పటికీ స‌ద‌రు వ్యక్తి వినకపోగా ఎస్‌ ఐ జనార్దన్‌‌ పై చేయిచేసుకున్నాడు. దీన్ని చూసిన మ‌రో ఎస్‌ ఐ క్రాంతికుమార్‌ అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. అక్కడున్న సీఐలు శుభకుమార్‌ - గోరంట్ల మాధవ్‌ అప్రమత్తమై స్పెషల్‌ పార్టీ పోలీసులను పిలిచించారు. ఎస్ ఐపై దాడిని జీర్ణించుకోలేని సీఐ గోరంట్ల మాధవ్‌ నిందితుడిపై లాఠీ ఝళిపిస్తూ... నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దారుణంగా కొట్టుకుంటూ టూటౌన్‌ పోలీసుస్టేషన్‌ కు తీసుకెళ్లి విచార‌ణ జ‌రిపారు. స‌ద‌రు బాధితుడు వివ‌ర‌ణ ఇస్తూ...వాతావ‌ర‌ణ శాఖ‌లో ప‌నిచేస్తున్న త‌న పేరు మాధ‌వ‌రెడ్డి అని, క‌డ‌ప జిల్లాకు చెందిన వ్య‌క్తిన‌ని పేర్కొంటూ మూడు రోజులుగా కొత్త క‌రెన్సీ స‌మ‌స్య‌తో తిరుగుతున్నాన‌ని చెప్పాడు. నాలుగోరోజు సైతం అదే రీతిలో బ్యాంకు వ‌ద్ద‌కు వ‌చ్చి వాహనాన్ని పార్క్ చేస్తున్న‌ స‌మయంలో ఎస్ఐ విసిగించ‌డంతో ఇలా చేయిచేసుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. అయితే సోష‌ల్ మీడియాలో ఈ సంఘ‌ట‌న దుమారం రేప‌డంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసిన ఘ‌ట‌న‌ను ఎస్పీ రాజశేఖర్‌ బాబు సీరియస్‌ గా తీసుకొని పూర్తి ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇన్‌ చార్జి డీఎస్పీ నర్సింగప్పను ఎస్పీ ఆదేశించినట్టు స‌మాచారం.

అయితే ఈ ప‌రిణామంపై సామాన్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. స‌దరు మాధ‌వ‌రెడ్డి ఎస్సైపై దాడిచేయ‌డ‌మే త‌ప్పు అని పేర్కొంటూనే సంయ‌మ‌నం పాటించాల్సిన పోలీసులు మంద‌బ‌లం ప్ర‌ద‌ర్శించ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. సామాన్యుల అసంతృప్తి స‌మ‌న్వ‌యం చేయాల్సిన వారే ఇలా ఆగ్ర‌హావేశాల‌కు లోనై రోడ్డుపై ప‌శువును బాధిన‌ట్లుగా కొట్ట‌డం ఏంటని మండిప‌డుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా, మ‌న పోలీసుల రాక్ష‌స‌త్వం ఈ స్థాయిలో ఉంటుందా అంటూ ఫైర‌వుతున్నారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/