Begin typing your search above and press return to search.

ఏపీ ఎన్‌కౌంటర్‌లో పోలీసులు ఇరుక్కొన్నట్టేనా?!

By:  Tupaki Desk   |   11 April 2015 5:27 AM GMT
ఏపీ ఎన్‌కౌంటర్‌లో పోలీసులు ఇరుక్కొన్నట్టేనా?!
X
శేషాచలం కొండల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ ఘటనలో పోలీసు అధికారులకు ముప్పు తిప్పులు తప్పేలా కనిపించడం లేదు. ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోవడం.. కేసుల నమోదుకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఈ తలనొప్పి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఎదురు కాల్పుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ కాదు.. పాయింట్‌బ్లాక్‌లో గన్‌ పెట్టి వారిని కాల్చి చంపారనే ఆరోపణలు ఉండటం.. పోలీసులే కూలీలను దగ్గరుండి కూలీలను తీసుకెళ్లారనే వారూ కనిపిస్తుండటం.. ఈ అంశం గురించి తమిళనాడు ప్రభుత్వం కూడా గట్టిగానే జోక్యం చేసుకొంటుండటంతో.. ఈ ఎన్‌కౌంటర్‌ వ్యవహారంలో కేసులు, విచారణ తప్పదని తెలుస్తోంది!

ఏదో అల్లాటప్పా ఎన్‌కౌంటర్‌ అయితే ఎవరూ అంతగా పట్టించుకొనే వారు కాదేమో.. ఒకేసారి 20 మంది కూలీలను ఎన్‌కౌంటర్‌ చేయడంతో ఈ సంఘటన ప్రాధాన్యత సంతరించుకొంది.

వాస్తవంగా ఎన్‌కౌంటర్‌లు అంటే.. ఇప్పటికే ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయం నాటుకుపోయింది. ఎదురు కాల్పులు అని చెప్పి చేసే ఎన్‌కౌంటర్లలో చాలా వరకూ నకిలీవే ఉంటాయని జనసామాన్యంలో కూడా విశ్వాసం ఉంది.

ఈ ఎర్రచందనం కూలీల విషయంలో పోలీసుల పొరపాట్లు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. సంఘటనా స్థలంలో పడేసిన ఎర్రచందనం దుంగలకు పెయింట్లు పూసి ఉండటం.. వంటి ఈ ఘటనలో పోలీసులను దోషులుగా చూపుతున్నాయి.

ఈ ఎన్‌కౌంటర్‌లో ఎవరెవరు పాల్గొన్నారు.. ఎవరెవరు తుపాకీలు ఎక్కుపెట్టారు.. ఎవరెవరి తుపాకీ నుంచి వచ్చిన బుల్లెట్‌ ఎవరిలోకి దిగింది... వంటి అంశాల గురించి పూర్తి క్లారిటీ ఇవ్వాలని కోర్టు ఏపీ పోలీసులను నివేదిక కోరుతోంది. దీంతో తప్పనిసరిగా ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసుల పేర్లను కోర్టుకు సమర్పించాల్సి వస్తోంది.

ఆ పోలీసులపై కేసులు నమోదయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌ నకిలీది అయినా.. అసలైనదే అయినా... ఆపోలీసులకు ఈ వ్యవహారంతో తలనొప్పి అయితే తప్పదు. ఒకవేళ కూలీలు ఏపీ వారే అయ్యి ఉంటే.. ఈ ఘటనపై అంత ఒత్తిడి తీసుకు వచ్చేవారు ఉండే వారు కాదేమో! ఇది రెండు రాష్ట్రాల కు చెందిన వ్యవహారం కావడం.. తమ రాష్ట్రానికి చెందిన వారి ఎన్‌కౌంటర్‌పై తమిళనాడు ప్రభుత్వం గట్టిగా రియాక్ట్‌ అవుతుండటంతో.. ఈ ఎన్‌కౌంటర్‌ ఘటన పై లోతైన విచారణ జరిగే అవకాశాలున్నాయి.