Begin typing your search above and press return to search.

బంజారాహిల్స్‌ లో కోళ్ల పందాలు..బెట్టింగ్‌ లు

By:  Tupaki Desk   |   8 Jan 2018 7:55 AM GMT
బంజారాహిల్స్‌ లో కోళ్ల పందాలు..బెట్టింగ్‌ లు
X
సంక్రాంతి వ‌స్తుందంటే..ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది కోళ్ల‌పందాలు. అయితే ఇది గోదావ‌రి జిల్లాల‌కే ప‌రిమితం కాలేదు... ఇటీవ‌ల కొన్ని జిల్లాల్లో కూడా క్రేజ్ మొద‌లైంది. అలా మెల్ల‌గా హైద‌రాబాద్ న‌గ‌రానికి కూడా ఈ కోళ్ల పందాల సెగ తగిలింది. ఏపీలో ర‌క‌ర‌కాల ష‌ర‌తులు విధిస్తున్న నేప‌థ్యంలో న‌గ‌రంలో పందెం కోళ్ల బెట్టింగ్‌ పై దృష్టి పెట్టారు. అయితే కోడి పందాలు భూమిపై అడితే పోలీసులకు దొరికిపోతామని అనుకున్నారు. అంతేకాదు...కోడి పందాలు ఎలా నిర్వహిస్తారో తెలిపే కుక్కుట శాస్త్రం పుస్తకాన్ని తెచ్చుకుని చదివారు. తిధి - నక్షత్రాలు చూసుకొని కోళ్లపై పందేలు పెట్టారు. పందెం రాయుళ్లకు సంక్రాంతి సంబరాల్లో కోడిపందాల రూచి చూపించేందుకు ఐదంతస్తుల అపార్టుమెంట్‌ పై కప్పును వేదికగా చేశారు. అయితే పోలీసులకు దొరికిపోయారు!

టాస్క్‌ ఫోర్స్ పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం ఆంధ్రాలో కోడిపందాల నిర్వహణపై సందిగ్దం నెలకొనడంతో హైదరాబాద్‌ లోనే ఈసారి సంక్రాంతి దాకా పందాల నిర్వహణ కోసం పక్కాగా పథకం వేసి నగరం నడిబొడ్డున కోడి పందాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లా కావలి మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన మల్లె వెంకటకృష్ణ(39) బతుకుదెరువుకోసం నగరానికి వచ్చి శ్రీ కృష్ణానగర్‌ లో నివాసం ఉంటున్నాడు. బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్‌ గా పనిచేస్తున్న వెంకటకృష్ణ డబ్బులు సంపాదించేందుకు కోళ్లపందాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలానికి చెందిన తన్నీరు వెంకట ప్రసాద్(49)తో కలిసి కోళ్ల పందాలను నిర్వహించేందుకు తాను నివాసం ఉంటున్న అపార్ట్‌ మెంట్‌ పై పెంట్‌ హౌజ్‌ ను వేదికగా చేసుకున్నారు. రూఫ్‌ పై ఇసుకను పోసిన నిర్వాహకులు కోళ్లపందానికి వేదికను సిద్ధం చేసి వివిధ ప్రాంతాలనుంచి పందెం రాయుళ్లను పిలిపించి స‌ర్వం సిద్ధం చేసుకున్నారు.

అప్పటివరకూ ప్రశాంతంగా ఉన్న బస్తీల్లో ఒక్కసారిగా కొక్కొరొకో అంటూ కోడిపుంజుల సందడి మొదలుకావడంతో ఈ వ్యవహారంపై టాస్క్‌ ఫోర్స్ పోలీసులకు స్థానికులు ఉప్పందించారు. భారీ మొత్తంలో డబ్బు లు పెట్టి కోళ్ల పందాలు ఆడుతున్నారన్న సమాచారం అందుకున్న వెస్ట్‌ జోన్ టాస్క్‌ ఫోర్స్ ఇన్‌ స్పెక్టర్ గట్టు మల్లు ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిర్వాహకులతో పాటు 27మంది పందెం రాయుళ్లను అరెస్ట్ చేసి వారివద్ద నుంచి 17పందెం కోళ్లు - 60 పందెం కత్తులు - 26 మొబైల్‌ ఫోన్లు - రూ.80 - 150వేల నగదు - కుక్కుట శాస్త్రం పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.

న‌గ‌రంలో కోడిపందాలు ఆడుతున్నట్లు టాస్క్‌ ఫోర్స్ పోలీసులకు సమాచారం వచ్చింది. అయితే అది ఎక్కడ అనేది స్పష్టం కాకపోవడంతో పోలీసులు కృష్ణానగర్ ప్రాంతంలో ఆరా తీశారు. అయితే ఐదంతస్తుల అపార్టుమెంట్‌ పైన ఇసుకతో టెర్రస్‌ పై ఈ ఆటను ఆడుతున్నట్లు గుర్తించారు. అయితే పోలీసులు అకస్మాత్తుగా దాడులు చేస్తే..భయపడి ఎవరైనా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నంలో ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలుండడంతో పోలీసులు పకడ్బందీ ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా టాస్క్‌ ఫోర్స్ పోలీసులు పందెం రాయుళ్ల మాదిరిగా అవతారమెత్తారు. ఒక కోడిని తీసుకొని, పందెం ఆడుతామంటూ అందులో చేరారు. అక్కడ ఎంత మంది ఉన్నారు.. ఎలా ఆడుతున్నారనే పూర్తి సమాచారం తీసుకున్న తరువాత టాస్క్‌ ఫోర్స్ బృందం రంగంలోకి దిగి పందెం రాయుళ్ల ఆటను కట్టించింది. హైదరాబాద్‌ లో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో కోళ్లను స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటి సారని పోలీసులు అంటున్నారు.