Begin typing your search above and press return to search.

అతను హెల్మెట్ వాడడు... అయినా నో ఫైన్

By:  Tupaki Desk   |   18 Sep 2019 8:54 AM GMT
అతను హెల్మెట్ వాడడు... అయినా నో ఫైన్
X
కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చట్టం కరకుదనం ఎంతన్నది అర్థం కావటమే కాదు.. పలువురు వాహనదారులు లబోదిబోమంటున్నారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే అన్నట్లుగా పోలీసులు విధిస్తున్న చలనాలు దేశ వ్యాప్తంగా కొత్త వార్తలుగా మారుతున్నాయి. నిబంధనల్ని ఉల్లంఘించిన వారి విషయంలో వదలకుండా వ్యవహరిస్తున్న వైనంతో.. వాహనదారుల్లో జాగ్రత్త మరింత పెరుగుతోంది.

ఇదిలా ఉంటే.. కొత్తగా వచ్చిన ట్రాఫిక్ నిబంధనల్లో భాగంగా హెల్మెట్ తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. అయితే.. గుజరాత్ లోని ఛోటా ఉదెపూర్ జిల్లాలోని బోడెలీ ప్రాంతానికి చెందిన జాకీర్ మెనన్ హెల్మెట్ పెట్టుకోకున్నా పోలీసులు వదిలేస్తున్నారు. మిగిలిన వారివిషయంలో కఠినంగా ఉంటున్న పోలీసులు జాకిర్ విషయంలో మాత్రం మినహాయింపుతో వ్యవహరిస్తున్నారు.

అలా అని జాకిర్ ఏమీ రాజకీయ ప్రముఖుడు కాదు. అతగాడి తల సైజు భారీగా ఉంటుంది. అతను పెట్టుకోవటానికి సరిపడా హెల్మెట్ మార్కెట్ లో ఎక్కడా లభించదు. తనకు చట్టం అంటే ఎంతో గౌరవమని.. చట్టాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతానని అతడు చెబుతుంటాడు. హెల్మెట్ తప్పించి.. మరే విషయంలోనూ అతడిలో తప్పు కనిపించదు. వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉంటాయి. కాకుంటే.. తన తలకు సరిపడా హెల్మెట్లు మార్కెట్లో దొరకటం లేదని చెప్పటం.. ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నపోలీసులు.. అతనికి హెల్మెట్ నుంచి మినహాయింపు ఇచ్చేస్తున్నారు. అతడికి ఎలాంటి చలానాలు వేయటం లేదు. దీంతో.. ఆ ప్రాంతంలో జకీర్ హెల్మెట్ లేకున్నా చలానా విషయంలో మినహాయింపు ప్రత్యేకతను సొంతం చేసుకున్నాడు.