Begin typing your search above and press return to search.

ఏపీ విప‌క్ష నేత‌లంటే చ‌ట్టానికి ఎంత క‌రుకు!

By:  Tupaki Desk   |   28 Jun 2017 10:30 AM GMT
ఏపీ విప‌క్ష నేత‌లంటే  చ‌ట్టానికి ఎంత క‌రుకు!
X
ఏపీ అధికార‌ప‌క్షం తీరుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. చిన్న చిన్న ఉదంతాల‌కు సైతం చ‌ట్టం క‌రుకుగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గా మారుతుంది. చ‌ట్టం ఎవ‌రి విష‌యంలో అయినా ఒకేలా ఉండాలి. అంతేకానీ.. అధికార‌ప‌క్ష నేత‌ల విష‌యంలో అస్స‌లు ప‌ట్ట‌న‌ట్లుగా.. విప‌క్ష నేత‌ల విష‌యంలో మ‌రింత క‌రుకుగా అస్స‌లు ఉండ‌కూడ‌దు. కానీ.. ఏపీలో మాత్రం ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొని ఉండ‌టంపై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌భుత్వ అధికారుల‌పై చేయి చేసుకొన్న‌ప్ప‌టికీ అరెస్ట్ కానీ అధికార‌ప‌క్ష నేత‌లు.. విపక్షానికి చెందిన నేత‌లు.. ధ‌ర్మాగ్ర‌హంతో బ‌ల్ల నెట్టేసినా కేసులు పెట్టేయ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఒక‌రుకాదు ఇద్ద‌రు కాదు ప‌లువురు ఏపీ అధికార‌ప‌క్ష నేత‌లు అధికారులు.. ఉన్న‌తాధికారుల‌పైన చేయి చేసుకోవ‌టం క‌నిపిస్తుంది. వీరి తీరుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తినా లైట్ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన ఏపీ అధికార‌ప‌క్షం.. జ‌గ‌న్ పార్టీ ఎమ్మెల్యే విష‌యంలో మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇదంతా కూడా విప‌క్ష నేత‌ల స్థైర్యాన్ని దెబ్బ తీసే వ్యూహంలో భాగమే అని చెబుతున్నారు.

దివంగ‌త భూమా నాగిరెడ్డి ఉదంత‌మే తీసుకుంటే.. ఆయ‌న జ‌గ‌న్ పార్టీలో ఉన్న‌ప్పుడు ఆయ‌న‌పై త‌ర‌చూ కేసులు న‌మోదు అవుతూ ఉండేవి. ఇది ఆయ‌నపై తీవ్ర ఒత్తిడిని పెంచ‌టంతో పాటు.. అధికార‌ప‌క్షంలో భాగ‌స్వామి అయితే త‌ప్ప మ‌న‌శ్శాంతిగా ఉండ‌లేన‌న్న భావ‌నకు వ‌చ్చార‌ని.. అదే ఆయ‌న్ను పార్టీ మారేలా చేసింద‌న్న మాట ప్ర‌ముఖంగా వినిపిస్తూ ఉంటుంది. ఇంచుమించు ఇదే విష‌యాన్ని క‌వ‌ర్ చేస్తూ.. భూమానాగిరెడ్డి కుమార్తె క‌మ్ ఏపీ రాష్ట్ర మంత్రి అఖిల ప్రియా ఇటీవ‌ల ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పార‌ని చెప్పాలి.

కేసుల క‌త్తుల్ని విప‌క్ష నేత‌ల‌పై గురి పెడుతూ.. వారిని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌న్న ఆరోప‌ణ ఏపీ స‌ర్కారుపై అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఈ వాద‌న‌కు బ‌లం చేకూరేలా కొన్ని ఉదంతాలు చోటు చేసుకోవ‌ట‌మే నిద‌ర్శ‌నంగా చెప్పాలి. ఈ మ‌ధ్య‌న తిరుప‌తి స‌మీపంలోని సి రామాపురం గ్రామంలో డంపింగ్ యార్డు కార‌ణంగా అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు. డంపింగ్ యార్డ్‌ కు వ్య‌తిరేకంగా అక్క‌డి గ్రామ‌స్తులు ఆందోళ‌న చేప‌ట్టారు. వారికి మ‌ద్ద‌తుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి గ్రామ‌స్తులతో క‌లిసి ఆందోళ‌న చేశారు.

ఈ వ్య‌వ‌హారంపై పోలీసులు సీరియ‌స్ అయి.. చెవిరెడ్డిపై కేసు న‌మోదు చేయ‌ట‌మే కాదు ఆయ‌న్ను అరెస్ట్ చేసి రిమాండ్ పంపిన వైనం చిత్తూరు జిల్లాలో క‌ల‌క‌లాన్ని రేపింది.

తాజాగా అమ‌రావ‌తిలో చోటు చేసుకున్న మ‌రో ఉదంతం కూడా పోలీసుల తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టేలా ఉంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. సీఆర్డీఏ అధికారులు మంగ‌ళ‌వారం రాజ‌ధాని గ్రామాల్లో ఒక‌టైన పెనుమాక‌లో గ్రామ‌స‌భ‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ జ‌రిగే విష‌యాల్ని మినిట్స్ బుక్ లో న‌మోదు చేయాల్సి ఉంటుంది. కానీ.. అధికారులు అలా చేయ‌కుండా ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఈ విష‌యం గురించి అడిగిన అక్క‌డి స్థానికులకు అధికారులు స‌మాధానం చెప్ప‌ని ప‌రిస్థితి. అధికారుల తీరుతో ఆగ్ర‌హం చెందిన స్థానికులు టెంట్లు పీకేసి..కుర్చీలు విసిరేశారు. ఈ ఉదంతంపై మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇలా చిన్న చిన్న అంశాల విష‌యంలో విప‌క్ష నేత‌లు ఏ మాత్రం సీరియ‌స్ గా స్పందిస్తున్న ఏపీ పోలీసులు.. అధికార‌ప‌క్ష నేత‌ల‌కు సంబంధించిన ఉదంతాల‌పై మాత్రం అస్స‌లు ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/