Begin typing your search above and press return to search.

ఆ బస్సులో ప్రయాణిస్తున్న89 మంది ఎవరంటే?

By:  Tupaki Desk   |   11 Oct 2015 4:50 AM GMT
ఆ బస్సులో ప్రయాణిస్తున్న89 మంది ఎవరంటే?
X
జాతి సంపద అయిన ఎర్రచందనాన్ని అక్రమ మార్గంలో కొల్లగొడుతూ.. పర్యావరణ సమస్యతో పాటు.. జాతి సంపదను దోచుకుంటున్న ఎర్రచందనం స్మగ్లర్ల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో తెలియజెప్పే ఘటన ఇది.

శేషాచల అడవుల్లోకి అక్రమంగా చొరబడి ఎర్రచందం దుంగల్ని భారీగా తరలించుకుపోయే వారిని అడ్డుకునేందుకు ఏపీ పోలీసులు ఎంతగా ప్రయత్నిస్తున్నా.. జరగాల్సినవి మాత్రం జరిగిపోతున్న పరిస్థితి. ఏపీ పోలీసులు ఎంత ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నా.. ఎర్రచందనం దొంగల్ని అదుపులోకి తీసుకున్నా.. బడా బడా స్మగ్లర్ లను అరెస్ట్ చేసినా.. ఎర్రచందనం అక్రమ తరలింపు మాత్రం భారీ ఎత్తున సాగుతుందనటానికి తాజా ఉదంతమే నిదర్శనం.

కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సులో పెద్ద ఎత్తున ఎర్రచందనాన్ని అక్రమంగా దోచుకెళ్లే కూలీలు ప్రయాణిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న చిత్తూరు జిల్లా పోలీసులు.. తనిఖీలు చేపట్టి షాక్ తిన్నారు.

ఎందుకంటే.. 50 మంది ప్రయాణించాల్సిన ఈ బస్సులో 89 మంది వరకుప్రయాణికులు ఉన్నారు. వీరంతా ఒకరి మీద ఒకరు పడినట్లుగా ఉన్నారు. వీరంతా ఎర్రచందనాన్ని దోచుకెళ్లేందుకు వస్తున్న తమిళ కూలీలుగా గుర్తించారు. పక్కా సమాచారంతో బస్సును నిలిపి తనిఖీ చేసిన పోలీసులు.. 89 మందితో పాటు.. ఎర్రచందనం చెట్లను నరికేందుకు అవసరమైన రంపాలు.. గొడ్డళ్లతో పాటు.. అడవిలో రోజుల తరబడి ఉండేందుకు వీలుగా.. వంట సామాను కూడా తమ వెంట తీసుకెళ్లటం విశేషంగా చెబుతున్నరు. ఓపక్క ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో తాము కఠినంగా వ్యవహరిస్తున్నామని ఏపీ సర్కారు చెప్పినా.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా.. ఇంత భారీగా ఉందన్న విషయం తాజా తనిఖీల్లో వెల్లడైందని చెప్పొచ్చు.