Begin typing your search above and press return to search.

మాట తూలిన అక్బ‌ర్‌ పై కేసు పెట్టారు

By:  Tupaki Desk   |   7 July 2017 5:43 AM GMT
మాట తూలిన అక్బ‌ర్‌ పై కేసు పెట్టారు
X
ఇష్టారాజ్యంగా మాట్లాడ‌టం ఓవైసీ బ్ర‌ద‌ర్స్‌కు మామూలే. పాత‌బ‌స్తీలో నిర్వ‌హించే స‌భ‌ల్లో.. త‌మ‌ను అభిమానించే వారు.. ఆద‌రించే వారిని వేలాదిగా చూడ‌టం.. వారిని అల‌రించేందుకు.. వారిని ఉత్సాహ‌ప‌రిచేందుకు.. రాజ‌కీయంగా త‌మ బ‌లాన్ని మ‌రింత‌గా పెంచుకునేందుకు మ‌తవ్యాఖ్య‌లు చేయ‌టం అక్బ‌రుద్దీన్‌కు అల‌వాటే. తాజాగా హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన ఒక బ‌హిరంగ స‌భ‌లో రెచ్చిపోయారు. భ‌ర‌త‌మాత‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌టం తీవ్ర క‌ల‌క‌లాన్ని రేపింది.

తాజాగా అక్బ‌రుద్దీన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై శివ‌సేన మండిప‌డింది. హైద‌రాబాద్ లో కూర్చొని కాదు.. ఇలాంటి వ్యాఖ్య‌లు ముంబ‌యిలో చేస్తే .. త‌గురీతిలో బదులిస్తామ‌ని.. ముంబ‌యికి వ‌చ్చి ఇలాంటి మాట‌లు చెబుతారా? అంటూ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. అక్బ‌రుద్దీన్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై హైద‌రాబాద్‌ కు చెందిన క‌రుణా సాగ‌ర్ అనే న్యాయ‌వాది సైదాబాద్ పోలీస్ స్టేష‌న్‌ లో ఫిర్యాదు చేశారు.

మ‌త‌ప‌ర‌మైన విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టేలా అక్బ‌రుద్దీన్ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌న్నారు. క‌రుణ సాగ‌ర్ ఇచ్చిన ఫిర్యాదును స్వీక‌రించిన సైదాబాద్ పోలీసులు అక్బ‌రుద్దీన్ పై 121.. 121ఏ.. 153ఏ.. 153బి.. 500.. 505.. 511.. 120బి సెక్ష‌న్ల కేసు న‌మోదు చేశారు. ఇంత‌కీ అక్బ‌రుద్దీన్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు ఏమిట‌న్న‌ది చూస్తే..

భ‌ర‌త‌మాత నుదుటిన హిందువులు తిల‌కం దిద్ది వీధుల్లో తిరిగితే.. భ‌ర‌త‌మాత‌కు టోపీ.. గ‌డ్డం పెట్టి తిరిగే ద‌మ్ము ముస్లింల‌కు ఉందంటూ మాట‌ల‌తో తెగ‌బ‌డ్డారు. ఇక్క‌డితో ఆగ‌ని ఆయ‌న‌.. కేంద్ర‌..రాష్ట్ర ప్ర‌భుత్వాలు ముస్లింల‌కు అన్యాయం చేస్తున్నాయంటూ ఆరోపించారు. ముస్లింల‌కు ప్ర‌త్యేక నియోజ‌క‌వ‌ర్గాలు కేటాయిస్తే బాగుంటుంద‌ని.. అలా చేస్తే న్యాయం చేసిన‌ట్లు అవుతుంద‌న్నారు. భిన్న‌త్వంలో ఏక‌త్వం ప్రాతిప‌దిక‌గా ఉన్న దేశంలో హిందువుల‌కు ఎంత హ‌క్కు ఉందో అంతే హ‌క్కు ముస్లింల‌కు ఉంద‌న్నారు. కేవ‌లం ముస్లిం ఓట్ల‌తోనే 50 పార్ల‌మెంటు స్థానాలు సాధించే అవ‌కాశం ఉందన్నారు. అక్బ‌రుద్దీన్ తాజా వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇటీవ‌లే చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై దుమారం రేగి చివ‌ర‌కు కేసు వ‌ర‌కు వెళ్లింది.