Begin typing your search above and press return to search.

ఎర్రగొండ్లపాలెం ఎమ్మెల్యే అంటే ఆ పోలీసులకు ఎంత భక్తో?

By:  Tupaki Desk   |   7 May 2016 6:50 AM GMT
ఎర్రగొండ్లపాలెం ఎమ్మెల్యే అంటే ఆ పోలీసులకు ఎంత భక్తో?
X
ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎంతగా ఉపయోగపడుతున్నారో లేదో తెలియడం లేదు కానీ ప్రజలను - ప్రభుత్వ ఉద్యోగులను బాగా ఉపయోగించుకుంటున్నారు. అదే సమయంలో ప్రజలు - ప్రభుత్వ అధికారుల్లో కొందరు కూడా తెలివిగా ప్రజాప్రతినిధులను ఉపయోగించుకుంటున్నారు. తమకు నచ్చిన చోటికి పోస్టింగు వేయించుకోవడానికి.... ఉద్యోగం సరిగా చేయకపోయినా ఎవరూ ఏమీ అనకుండా ఉండడానికి.. ఏసీబీ కేసుల్లో దొరికినా మళ్లీ పోస్టింగు దక్కించుకోవడానికి... ఒకటేమిటి ఇలా తమ అవసరాల కోసం ప్రజాప్రతినిధులను వాడుకుంటున్నారు.

ప్రజా ప్రతినిధులు కూడా అధికారులతో తమ పనులన్నీ చేయించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాప్రతినిధులు - ప్రభుత్వ అధికారులు కుమ్మక్కయి జనాన్ని దోచుకుంటున్నారనే చెప్పాలి. అందుకే ప్రజాప్రతినిధుల పుట్టిన రోజులు వంటివి వచ్చినప్పుడు ఏమాత్రం మొహమాటం లేకుండా ప్రభుత్వ అధికారులు కూడా శుభాకాంక్షలు చెబుతూ పత్రికల్లో పెద్దపెద్ద ప్రకటనలు వేసి తమ భక్తి చాటుకుంటున్నారు. ఏదో పెద్దగా ప్రాధాన్యం లేని డిపార్టుమెంటులైతే సర్లే అని సరిపెట్టుకుంటారు. కానీ.. కీలకమైన పోలీసు శాఖ ఉద్యోగులు కూడా ఎమ్మెల్యేలకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రకటనలు ఇస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది పరాకాష్ఠే.

పోలీసు అంటే ప్రజలను రక్షించాల్సిన వాడు. చట్టాన్ని అమలు చేయడం.. నేరస్థులను పట్టుకోవడం వంటి విషయాల్లో తనపర భేదం లేకుండా పనిచేయాలి. ఎవరికీ కొమ్ము కాయకూడదు. కానీ... ఇలా ఒక ఎమ్మెల్యే పట్ల భక్తి చాటుకుంటూ బహిరంగ ప్రకటనలు ఇవ్వడమంటే అది ప్రజలకు అనుమానాలు కలిగించడమే. ఇలాటి పరిస్థితుల్లో సాధారణ ప్రజలు ఏ నమ్మకంతో పోలీసుల వద్దకు రాగలరు. ఎమ్మెల్యేలు - ఎంపీలు వంటివారు చెబితేనే పోలీసులు వింటారేమో.. లేదంటే, వారికే అనుకూలంగా ఉంటారేమో అనుకోవచ్చు.

తాజాగా ప్రకాశం జిల్లాలో ఎర్రగొండ్ల పాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు జన్మదినం సందర్భంగా ఒక డీఎస్సీ - అయిదుగురు ఎస్సైలు తమ పొటోలతో.. ఎమ్మెల్యే నిలువెత్తు ఫొటోతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. మార్కాపురం డీఎస్పీ - ఎర్రగొండ్లపాలెం - పుల్లలచెరువు - త్రిపురాంతకం - డోర్నాల - పెద్దారవీడు ఎస్సైలు అహోఒహో అంటూ ప్రకాశం జిల్లా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. అంతేకాదు.. ఆ ప్రకటనల్లో చంద్రబాబు - లోకేశ్ - ప్రకాశం జిల్లా మంత్రులు - అక్కడి టీడీపీ ఎమ్మెల్యేలు - ఇతర ముఖ్యనేతల ఫొటోలు ఉన్నాయి. ఇదంతా చూసినవారు వీరు పోలీసు అధికారులా లేదంటే టీడీపీ కార్యకర్తలా అనుకుంటున్నారు. ఇంకొందరైతే వీరు ప్రజలను కాపాడాల్సిన పోలీసులా - ఎమ్మెల్యే మనుషులా అని ప్రశ్నిస్తున్నారు.