Begin typing your search above and press return to search.

నయింతో లింకున్న నేతలకు మూడినట్లేనా?

By:  Tupaki Desk   |   4 Nov 2016 4:38 AM GMT
నయింతో లింకున్న నేతలకు మూడినట్లేనా?
X
నయిం ఎన్ కౌంటర్ అనంతరం.. అతగాడి దారుణాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఈ ఉదంతం గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ షాకింగ్ కు గురయ్యే పరిస్థితి. వ్యక్తి వ్యవస్థగా మారటమే కాదు.. ఆరాచకాల్ని యథేచ్ఛగా చేపట్టటం.. బరితెగింపుతో వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా నేరాలకు పాల్పడటమే కాదు.. వ్యవస్థలో కీలకమైన రాజకీయ నేతలు.. పోలీసు అధికారులు.. జర్నలిస్టుల్ని తన గుప్పిట్లో ఉంచుకొని తాను ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లుగా వ్యవహరించిన వైనం బయటకు వచ్చి సంచలనంగా మారిన ముచ్చట తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఇటీవల తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యను పోలీసులు విచారించిన వైనం తెలిసిందే. దీనికి ముందు తెలంగాణ అధికార పక్షానికి చెందిన శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ రావు పేరు తెరపైకి రావటం తెలిసిందే. నయిం కేసులో ఇప్పటివరకూ 108 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా నయిం అనుచరులే.

అయితే.. నయింతో అంటకాగిన పోలీసు అధికారులు.. రాజకీయ నేతలు.. ఇతర వర్గాలకు చెందిన వారు కూడా పెద్ద ఎత్తున ఉన్నారన్న విషయం సిట్ నిర్వహించిన విచారణలో తేలింది. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే.. రాంగ్ సిగ్నల్స్ పంపినట్లు అవుతుందన్న భావన వ్యక్తమవుతోంది. అందుకే.. నయిం కేసుకు సంబందించిన విషయంలో కరుకుగా వ్యవహరించాలని.. నయింతో సంబంధాలు ఉన్న వారు ఎలాంటి వారైనా సరే.. వారిపై చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉందని చెబుతున్నారు.

నయిం ఇష్యూలో చర్యలు తీసుకోకుంటే.. భవిష్యత్తులో ప్రభుత్వానికి.. పోలీసు శాఖకు తిప్పలు తప్పవన్న ఉద్దేశంతో అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని.. వారిని అదుపులోకి తీసుకొని చట్టప్రకారం చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. రాజకీయ పరమైన ఒత్తిడి వచ్చినప్పటికీ లొంగకూడదని.. నయింతో సంబంధాలు ఉన్న వారికి సంబంధించి పక్కా ఆధారాలు ఉన్న వారందరిపైనా చర్యలు తీసుకోవాలనే భావనలో పోలీసు శాఖ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధుల్ని మొదట టార్గెట్ చేయాలని పోలీసు వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. చూస్తుంటే.. రానున్న రోజుల్లో నయింతో సంబంధాలు ఉన్న వారికి మూడినట్లేనని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/