Begin typing your search above and press return to search.

ర‌విప్ర‌కాశ్ ఎపిసోడ్ ముగింపున‌కు వ‌చ్చేసిన‌ట్లేన‌ట‌!

By:  Tupaki Desk   |   4 Jun 2019 5:18 AM GMT
ర‌విప్ర‌కాశ్ ఎపిసోడ్ ముగింపున‌కు వ‌చ్చేసిన‌ట్లేన‌ట‌!
X
మీడియాలో ఒక వెలుగు వెలిగిన టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ ఇప్పుడు ఎలాంటి ప‌రిస్థితుల్లోకి వెళ్లారో తెలిసిందే. త‌న‌పై వ‌చ్చిన నేరారోప‌ణ‌లు.. కేసుల నుంచి జైలును త‌ప్పించుకోవ‌టం కోసం ఆయ‌న కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. పోలీసుల‌కు దొర‌క్కుండా.. ఎప్ప‌టిక‌ప్పుడు తానుండే ప్రాంతాల్ని మార్చేస్తున్న ఆయ‌న‌.. కోర్టుల నుంచి ముంద‌స్తు బెయిల్ తెచ్చుకునేందుకు విప‌రీతంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

మొద‌ట్లో హైకోర్టు.. ఆ త‌ర్వాత సుప్రీం కోర్టును ఆశ్ర‌యించిన ఆయ‌న‌కు ప్ర‌తి చోటా ఎదురుదెబ్బ‌లే త‌గులుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ వెన‌క్కి త‌గ్గ‌కుండా ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా సుప్రీంకోర్టులో త‌గిలిన ఎదురుదెబ్బ నేప‌థ్యంలో ఆయ‌న‌కు మ‌ళ్లీ హైకోర్టు ఆప్ష‌న్ త‌ప్పించి మ‌రింకేమీ లేదు. ఇదిలా ఉంటే.. ప్రొఫెష‌న‌ల్ క్రిమిన‌ల్స్ ను సైతం పోలీసులు త‌మ డేగ‌చూపుతో ఇట్టే ప‌ట్టేసుకునే ఉదంతాలెన్నో.

అలాంటిది ర‌విప్ర‌కాశ్ ను అదుపులోకి తీసుకోవ‌టానికి పోలీసులు కిందామీదా ఎందుకు ప‌డుతున్నారు. ఆయ‌న ఆచూకీని ఎందుకు ప‌సిగ‌ట్ట‌లేక‌పోతున్నార‌న్న సందేహం ప‌లువురికి వ‌స్తోంది. అయితే.. పోలీసులు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ర‌విప్ర‌కాశ్ మీద ఉన్న అభియోగాలు తీవ్ర‌మైన‌వే అయిన‌ప్ప‌టికీ ఆయ‌న మీడియాకు చెందిన ప్ర‌ముఖుడు కావ‌టంతో చ‌ట్ట‌బ‌ద్ధంగా ఆయ‌న‌కు ఇవ్వాల్సిన అవ‌కాశాల‌న్ని ఇవ్వాల‌న్న ఉద్దేశంతోనే ఆగిన‌ట్లు చెబుతున్నారు.

ర‌విప్ర‌కాశ్ ను వేధింపుల‌కు గురి చేసిన‌ట్లుగా పోలీసుల మీద నింద ప‌డ‌కుండా ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతున్న‌ట్లుగా చెబుతున్నారు. ర‌విప్ర‌కాశ్ ను అదుపులోకి తీసుకోని కార‌ణంగా స‌మాజానికి కానీ జ‌రిగే న‌ష్టం ఏమీ ఉండ‌దు. అదే స‌మ‌యంలో హ‌డావుడిగా అరెస్ట్ చేసిన ప‌క్షంలో పోలీసుల మీద అత్యుత్సాహంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ ముద్ర ప‌డే అవ‌కాశం ఉండ‌టంతో జాగ్ర‌త్త‌గా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే వీలైన‌న్ని అవ‌కాశాలు ఇచ్చి.. అవ‌న్నీ ఫెయిల్ అయ్యాక ఆయ‌న్ను అదుపులోకి తీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో పోలీసులు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

తాజాగా ర‌విప్ర‌కాశ్ బెయిల్ పిటిష‌న్ ను సుప్రీం సైతం రిజెక్ట్ చేసిన స‌మ‌యంలో.. ఆయ‌న్న అదుపులోకి తీసుకోవ‌టానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. గ‌డిచిన కొద్ది రోజులుగా కనిపించ‌కుండా పోయిన ర‌విప్ర‌కాశ్ ఆచూకీని పోలీసులు ట్రేస్ చేయ‌గ‌లిగార‌ని.. ఆయ‌న్ను ఏక్ష‌ణంలో అయినా అదుపులోకి తీసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసిన‌ట్లుగా స‌మాచారం. పోలీసు వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ర‌విప్ర‌కాశ్ ఎపిసోడ్ దాదాపుగా ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసిన‌ట్లుగా చెబుతున్నారు.