Begin typing your search above and press return to search.

అఖిలప్రియ తమ్ముడి దౌర్జన్యం ..కేసు నమోదు !

By:  Tupaki Desk   |   15 Jun 2020 11:50 AM GMT
అఖిలప్రియ తమ్ముడి దౌర్జన్యం ..కేసు నమోదు !
X
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి పై కేసు నమోదైంది. ఆళ్లగడ్డ నగర పంచాయతీ పరిధిలోని పడకండ్లలో పొలం దారి విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో ఆదివారం టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్‌ శూలం నరసింహుడు ప్రత్యర్థులపై దాడి చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌ రెడ్డి తన అనుచరులతో కలిసి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లోకెళ్లి అడ్డొచ్చిన పోలీసులను తోసేసి నిందితుడిని తీసుకెళ్లాడు.

ఈ విషయాన్ని స్టేషన్‌ సిబ్బంది పోలీస్‌ ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు అఖిలప్రియ ఇంటి వద్దకెళ్లి మళ్లీ నిందితుడిని స్టేషన్‌ తీసుకెళ్లారు. దీంతో భూమా విఖ్యాత్‌ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 353, 224, 225, 212 సెక్షన్ల కింది కేసు ఫైల్‌ చేశారు. ఇకపోతే గత కొన్ని రోజులుగా భూమా కుటుంబాన్ని వరుస వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో ఓ గ్రానైట్ పరిశ్రమ విషయంలో అఖిలప్రియ భర్తపై కేసులు నమోదైంది. హైదరాబాద్‌ పోలీసులు కూడా మరో కేసు నమోదు చేశారు. ఈ విషయం అప్పట్లో సంచలనంరేపింది. ఆ కేసు మర్చిపోకముందే టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ జగత్ విఖ్యాత్ ‌రెడ్డిపై కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది.