Begin typing your search above and press return to search.
చేతికి అందిన వాళ్లనీ పట్టుకోలేకపోయారే?
By: Tupaki Desk | 2 Nov 2015 10:11 AM GMTహైదరాబాద్ నగరంలో హడలెత్తిస్తున్న చైన్ స్నాచింగ్ దొంగలు ఎంతగా చెలరేగిపోతున్నారో తెలిసిందే. బైకుల మీద వచ్చి.. మెరుపు వేగంతో తమ పని పూర్తి చేసుకొని.. క్షణాల్లో మాయమయ్యే వీరిని పట్టుకోవటం కోసం కిందామీదా పడుతున్న సంగతి తెలిసిందే. చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు వారు ఎక్కువగా వినియోగిస్తున్నారని భావించిన పల్సర్ బైకుల్ని నడిపే వారందరిని తనిఖీలు చేయటం ఈ మధ్యన కనిపిస్తున్నదే. చైన్ స్నాచర్లు పట్టుకునే విషయంలో హైదరాబాద్ నగర పోలీసులు వైఫల్యం చెందారన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. తాజాగా చోటు చేసుకున్న సంఘటన ప్రజలకు షాకిచ్చేలా ఉది.
నగర శివారు అయిన వనస్థలి పురంలో చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించటం.. ఈ క్రమంలో వారిని గాయపర్చటం కోసం కాల్పులు జరిపినప్పటికీ పెద్దగా ఫలితం లేదన్న విమర్శ వినిపిస్తోంది. ఆటోనగర్ వద్ద ఒక మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లేందుకు బైక్ మీద వచ్చిన ఇద్దరు యువకులు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన పోలీసులు బైక్ మీద వస్తున్న దొంగలపై కాల్పులు జరిపారు. అయినా.. వారు తప్పించుకున్నారు. అయితే.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి అందుబాటులోకి వచ్చింది.
ఈ వీడియోను చూసిన వారికి పోలీసులు ఎంతగా ప్రయత్నించారో తెలుసుకొని షాక్ తినే పరిస్థితి. గొలుసు దొంగలు బైక్ మీద వస్తుండటం.. వారిని పట్టుకునేందుకు పోలీసు ప్రయత్నించటం.. కుదరక కాల్పులు జరపటం ఈ వీడియో కనిపిస్తుంది. కాకుంటే.. చాలా దగ్గరగా ఇంకా కచ్ఛితంగా చెప్పాలంటే.. అత్యం సమీపంలో ఉన్న దొంగపై సూటిగా కాల్పులు జరపటంలో విఫలం కావటం ఆశ్చర్యం వ్యక్తం కాక మానదు. చాలా సమీపంలో నుంచి వెళుతున్న దొంగల్ని బైకు మీద పడిపోయినా దొరికిపోవటం ఖాయం. కానీ.. పోలీసులు కాల్పులు జరపటం.. రెండు రౌండ్లు కాల్చినా అవి గురి తప్పటంతో గొలుసు దొంగలు క్షేమంగా బయటపడేందుకు అవకాశం కల్పించినట్లుగా సదరు వీడియో క్లిప్పింగ్ ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు పోలీసులు కాల్పులు జరుపుతున్నా.. ఎలాంటి త్రోటుపాటుకు గురికాకుండా బైక్ ని వంపు తిప్పేసి ఎస్కేప్ అయిన తీరు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.