Begin typing your search above and press return to search.

మంద‌కృష్ణ హౌస్ అరెస్ట్‌.. ప‌రిస్థితి ఉద్రిక్త‌తం

By:  Tupaki Desk   |   17 April 2019 8:38 AM GMT
మంద‌కృష్ణ హౌస్ అరెస్ట్‌.. ప‌రిస్థితి ఉద్రిక్త‌తం
X
ఒక ఉద్య‌మ నేత‌కు రాజ్యాధికారం వ‌స్తే? అత్యున్న‌త స్థానానికి చేరుకుంటే? ఎలా ఉంటుంది? సుదీర్ఘ కాలం ఉద్య‌మాన్ని న‌డిపిన స‌ద‌రు వ్య‌క్తి చేతికి రాజ‌దండం వ‌చ్చిన‌ప్పుడు.. త‌న రాజ్యంలో ఉద్య‌మాల‌కు.. ఆందోళ‌న‌ల విష‌యంలో ఎలా రియాక్ట్ అవుతారు? ఉద్య‌మ నేత‌ల విష‌యం ఆయ‌న తీరు ఎలా ఉంటుంది? అన్న ప్ర‌శ్న‌ల‌కు త‌న పాల‌న‌తో స‌మాధానం చెప్పేస్తున్నారు తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్.

ఐదేళ్ల కాలంలో కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని చూసిన‌ప్పుడు.. ఏ విష‌యం మీదా ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌లు నిర్వ‌హిస్తున్న వారి విష‌యంలో పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ప్ర‌జాస్వామ్యంలో ఆందోళ‌న‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుంటే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఎప్పుడు ఏ నిర‌స‌న‌.. ఆందోళ‌న చేప‌ట్టినా.. అనుమ‌తులు లేవంటూ వ్య‌వ‌హ‌రిస్తున్న వైఖ‌రిపై ఉద్య‌మ నేత‌లు ప‌లువురు గుర్రుగా ఉంటున్నారు.

పంజాగుట్ట‌లో అనుమ‌తి లేకుండా ఏర్పాటు చేయ‌ద‌లిచిన అంబేడ్క‌ర్ విగ్ర‌హాన్ని తొల‌గించే విష‌యంలో ఎవ‌రికి ఎలాంటి అభ్యంత‌రం లేదు. కానీ.. అలా తొల‌గించిన విగ్ర‌హాన్ని త‌ర‌లించిన త‌ర్వాత చోటు చేసుకున్న ప‌రిణామాల‌పైనే అభ్యంత‌ర‌మంతా. దీనిపై ఇప్పుడు ద‌ళిత నేత‌లు నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ ఆందోళ‌న బాట ప‌డుతున్నారు.

ఇదే స‌మ‌యంలో అంబేడ్క‌ర్ జ‌యంతి ఉత్స‌వాల్లో సీఎం కేసీఆర్ ఎందుకు పాల్గొన‌లేద‌న్న విష‌యంపై మంద‌కృష్ణ ప్ర‌శ్నిస్తున్నారు. ద‌ళితుడైనందునే అంబేడ్క‌ర్ ను కేసీఆర్ అవ‌మానించిన‌ట్లుగా ఆరోపిస్తున్నారు. అంబేడ్క‌ర్ జ‌యంతి రోజున ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న ఆయ‌న‌.. అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి పూల‌దండ వేసి.. నివాళులు అర్పించేందుకు ఎందుకు రాలేదంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆయ‌న ఆందోళ‌న నిర్వ‌హించేందుకు రెఢీ అవుతున్న వేళ‌.. ఆయ‌న్ను ఇంట్లో నుంచి రాకుండా హౌస్ అరెస్ట్ చేస్తూ పోలీసులు నిర్ణ‌యం తీసుకున్నారు.అనుమ‌తి లేకుండా ఆందోళ‌న నిర్వ‌హించాల‌నుకుంటున్నార‌ని.. శాంతిభ‌ద్ర‌త‌ల‌కు ముప్పు వాటిల్లే ప్ర‌మాదం ఉండ‌టంతో ఆయ‌న్ను ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా హౌస్ అరెస్ట్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. దీనిపై మంద‌కృష్ణ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

నియంత మాదిరి కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా మండిప‌డుతున్నారు. త‌న తొలి ప్ర‌భుత్వంలోనే కాదు.. తాజా ప్ర‌భుత్వంలోనూ ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌లు లాంటివి న‌డ‌వ‌న్న విష‌యాన్ని తాజా చ‌ర్య‌తో కేసీఆర్ స్ప‌ష్టం చేసిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.