Begin typing your search above and press return to search.

టిప్పు రాజేసిన నిప్పు ఇది

By:  Tupaki Desk   |   10 Nov 2017 8:59 AM GMT
టిప్పు రాజేసిన నిప్పు ఇది
X

టిప్పు సుల్తాన్ జ‌యంతి పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. టిప్పు అంటే పడని బీజేపీ ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముస్లిం చక్రవర్తి టిప్పు సుల్తాన్ అధికారికంగా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ప్రకటించగానే బీజేపీ - ఆర్‌ ఎస్‌ ఎస్‌ లు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. మైనారిటీలను మచ్చిక చేసుకునేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని వారు ఆరోపించారు. దీన్లో భాగంగానే తనను టిప్పుజయంతికి ఆహ్వానించవద్దని కేంద్ర మంత్రి హెగ్డే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ రాశారు. టిప్పు ఓ క్రూరుడని - అనేక మందిని ఊచకోత కోశాడని మంత్రి తీవ్ర విమర్శ చేశారు. అలాంటి అరాచక చక్రవర్తి జయంతికి తాను హాజరుకాబోనంటూ ఏకంగా ట్వీట్ చేశారు. రాష్ట్ర బీజేపీ శ్రేణులు సైతం ఇదే వాద‌న వినిపించ‌గా...కాంగ్రెస్ మాత్రం ఆయ‌న్ను వీరుడంటూ ప్ర‌శంసించింది.

అయితే విమర్శలు - నిరసనలు ఎదురైన రాష్ట్రమంతటా టిప్పూ జయంతి సభలు జరిగాయి. అయితే ఈ జ‌యంతి కార‌ణంగా అధికార కాంగ్రెస్ - ప్ర‌తిప‌క్ష‌ బీజేపీల మధ్య ‘టిప్పు జయంతి’ ర‌చ్చ జ‌రిగింది. టిప్పుసుల్తాన్ జయంతిని వ్యతికిస్తూ మడికేరిలో సంపూర్ణ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా ధర్నా కూడా నిర్వ‌హించారు. ఈ సందర్భంలో అటువైపు వెళ్లిన కేఎస్ఆర్టీసీ బస్సుల మీద రాళ్ల వర్షం కురిపించారు. దీంతో ప్ర‌జా ర‌వాణ సైతం స్తంభించింది. టిప్పుసుల్తాన్ జయంతిని వ్యతిరేకిస్తూ శుక్రవారం అల్లర్లు ఎక్కువ కావడంతో బీజేపీ ఎమ్మెల్యే అప్పచ్చు రంజన్ తో పాటు ఆ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మ‌రోవైపు మడికేరి స‌హా బెంగళూరులోని పలు ప్రాంతాలు - దక్షిణ కన్నడ జిల్లా - బళ్లారి - శివమొగ్గ - భద్రావతి - మైసూరు - చికమగళూరు - మంగళూరు - తదితర ప్రాంతాల్లో నిషేదాజ్ఞలు విధించారు. సాయుధ బ‌ల‌గాలు ప్ర‌హార కాస్తున్నాయి.

కాగా ఈ వివాదంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. బ్రిటిష్ పాలకులపై ఐదుసార్లు యుద్ధం చేసిన ధీశాలి టిప్పూ అని దాన్ని రాజకీయం చేయడం బీజేపీకి తగదని అన్నారు. కేంద్ర మంత్రి ట్వీట్ పై స్పందిస్తూ...గౌరవం కొద్దీ పిలుస్తాం. ప్రొటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం మా విధి. రావడం.. రాకపోవడం అన్నది వారి ఇష్టం’ అని పేర్కొన్నారు.