Begin typing your search above and press return to search.

శిల్పా ఇంటి ద‌గ్గ‌రేం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   22 Aug 2017 5:30 PM GMT
శిల్పా ఇంటి ద‌గ్గ‌రేం జ‌రుగుతోంది?
X
రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న నంద్యాల ఉప ఎన్నిక‌ల పోలింగ్‌కు గంట‌ల వ్య‌వ‌ధి మాత్ర‌మే ఉంది. ఇప్ప‌టికే అధికార‌.. విపక్షాల మ‌ధ్య హాట్ హాట్ గా మారిన ఈ ఉప ఎన్నిక.. పోలింగ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డే కొద్దీ ఉద్రిక్త‌త దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లుగా ఉంద‌ని. అధికార‌ప‌క్షానికి చెందిన నేత‌లు ప‌లువురు నంద్యాల‌లో మ‌కాం వేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు పెద్ద ఎత్తున వ‌స్తున్న వేళ‌.. నంద్యాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి ఇంటి ద‌గ్గ‌ర పోలీసుల హ‌డావుడి సంచ‌ల‌నంగా మారింది.

రాత్రి వేళ‌లో శిల్పా ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చిన పోలీసులు అక్క‌డున్న సిబ్బంది.. పోలింగ్ ఏజెంట్ల‌ను బ‌ల‌వంతంగా బ‌య‌ట‌కు పంపేశారు. ఎందుకిలా చేస్తున్నారంటూ శిల్పా ప్ర‌శ్నించినా.. పోలీసులు ప‌ట్టించుకోలేదు. ఏజెంట్ల‌కు ఫారాలు పంచ‌నీయ‌కుండా అడ్డుప‌డ‌టం స‌రికాదంటూ హిత‌వు ప‌లుకుతున్న శిల్పా మాట‌ల్ని అధికారులు అస్స‌లు ప‌ట్టించుకోలేదు.

ఉప ఎన్నిక పోలింగ్ కొద్ది గంట‌ల్లో జ‌ర‌గ‌నున్న వేళ పోలింగ్ స్టేష‌న్లో కూర్చునే ఏజెంట్ల‌కు సంబంధిత ప‌త్రాలు ఇవ్వ‌కుంటే వారుఎలా ప‌ని చేస్తారు? అని పోలీసుల్ని ప్ర‌శ్నించినా వారేమీ స‌మాధానం ఇవ్వ‌టం లేద‌ని శిల్పా మోహ‌న్ రెడ్డి చెబుతున్నారు. ఎస్ ఐ.. సీఐ.. డీఎస్పీలు ఇంటికి వ‌చ్చి త‌మ పోలింగ్ ఏజెంట్లు.. వాచ్ మెన్‌.. డ్రైవ‌ర్ల‌ను బ‌య‌ట‌కు పంపేశార‌ని.. చివ‌ర‌కు త‌న త‌మ్ముడు చ‌క్ర‌పాణిరెడ్డిని కూడా త‌న ఇంట్లో ఉండొద్ద‌ని చెబుతున్నార‌న్నారు.

అధికార‌ప‌క్షానికి కొమ్ముకాయ‌టం స‌రికాదంటూ అధికారుల తీరును త‌ప్పు ప‌డుతూ శిల్పా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ ఇంట్లో త‌మ‌ను ఉండొద్దంటున్నార‌ని.. తాము ఉండేదే నంద్యాల‌లో అని.. త‌మ ఇంటి వ‌ద్ద ట్రాఫిక్ ఉంద‌ని అంటున్నార‌ని.. త‌మ ఇల్లేం సెంట‌ర్ లో ఏమీ లేద‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు.

టీడీపీ మంత్రులు బ‌స చేసిన సూర‌జ్ గ్రాండ్ హోట‌ల్ ద‌గ్గ‌ర ప‌దుల సంఖ్య‌లో వాహ‌నాలు.. వంద‌ల సంఖ్య‌లో జ‌నం ఉన్నార‌ని.. అక్క‌డ ట్రాఫిక్ స‌మ‌స్య క‌నిపించ‌టం లేదా? అని ప్ర‌శ్నించిన శిల్పా.. టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య నంద్యాల సినిమాహాల్లో క‌నిపించార‌న్నారు.

మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి నెంబ‌రు ప్లేట్ లేని వాహ‌నంలో తిరుగుతున్నార‌ని.. మ‌రో మంత్రి సోమిరెడ్డి త‌దిత‌రులు నంద్యాల‌లోనే ఉన్నార‌ని.. వారిని ప‌ట్టించుకోని పోలీసులు.. ఏక‌ప‌క్షంగా త‌మ ఇంటిపైకి రావ‌టం ఏమిటంటూ ప్ర‌శ్నించారు. ఇదిలా ఉండ‌గా.. ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన శిల్పాకు ఏజెంట్ల‌తో మాట్లాడే హ‌క్కు ఉంటుంది క‌దా? ఎందుకు అడ్డుకుంటున్నార‌ని కొంద‌రు మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించ‌గా.. నంద్యాల‌లో ప్ర‌స్తుతం 144 సెక్ష‌న్ అమ‌ల్లో ఉంద‌ని.. ఐదుగురుకు మించి ఎక్కువ మంది ఉండ‌కూడ‌ద‌ని పోలీసులు చెప్ప‌టం గ‌మ‌నార్హం. అయితే.. ఈ నిబంధ‌న‌లు ఏమీ టీడీపీ నేత‌లు వ‌ర్తించ‌వా? అని ప్ర‌శ్నిస్తున్నారు.