Begin typing your search above and press return to search.
మీడియా వ్యాపారంలోకి విక్రమ్ గౌడ్..కాల్పులకు లింక్?
By: Tupaki Desk | 29 July 2017 8:15 AM GMTహైదరాబాద్‌కు చెందిన మాజీ మంత్రి ముఖేష్ కొడుకు విక్రంగౌడ్ ఇంట్లో చోటు చేసుకున్న కాల్పుల ఘటనపై ఎన్నో అనుమానాలు, రకరకాల ఉహాగానాలు వస్తున్నాయి. ఈ ఘటనపై శాస్త్రీయమైన ఆధారాలను పూర్తిస్థాయిలో సేకరించిన తరువాతే స్పష్టత ఇస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించడం, సీన్ రి కన్ స్ట్రక్షన్ చేస్తూ అగంతకుడు ఎలా వచ్చి ఉంటాడనే విషయంలో స్పష్టత కోసం క్లూస్ టీమ్ ఘటన స్థలంలో శుక్రవారం రాత్రి వరకు ఆధారాలు సేకరించింది. తనంతట తానుగా కాల్చుకుంటే ఎంత దూరంలో నుంచి కాల్చుకునే అవకాశాలుంటాయి, అగంతకుడు కాల్చితే ఎలా ఉంటుంది, తనకు తెలిసిన వాడితో కాల్పించుకుంటే ఎలా ఉంటుందనే విషయాల్లో శాస్త్రీయమైన ఆధారాలను సేకరిస్తున్నారు. ఇక్కడ సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి, అక్కడి నుంచి స్పష్టత తీసుకోనున్నారు.
హత్యాయత్నం జరిగిందని చెబుతున్న విక్రమ్ గౌడ్, వచ్చిన అగంతకుడి గురించి చిన్న క్లూస్ కూడా పోలీసులకు ఇవ్వడం లేదు. మధ్యాహ్నం వరకు ఆయన మాట్లాడేందుకు ఇబ్బంది ఉన్నా.. పోలీసులు అతని నుంచి ఏదైనా సమాచారం వస్తుందా అని రాత్రి వరకు ఎదురు చూశారు. ఘటన విషయంపై ఆయన నోరు మెదపకపోవడంతో అనుమానాలు వస్తున్నాయి. తన స్నేహితుడు వచ్చేది ఉందని, గేట్ కు తాళం వేయవద్దంటూ వాచ్ మెన్ కు విక్రంగౌడ్ సూచించడంతో, గేట్ కు తాళం వేయలేదని వాచ్ మెన్ చెబుతున్నాడు. తాము ఇంటికి సమీపంలో ఉన్న హకీం బాబా దర్గాలో అన్నదానం చేయాలనుకున్నామని, దాని కోసమే త్వరగా నిద్ర లేచి తయారయ్యామని చెబుతున్నా.. అందులో వాస్తవమెంతా? అంత తెల్లవారుజామున దర్గా వద్ద అన్నదానం నిర్వహించడం కుదరదు. జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడికి వెళ్లాలనుకున్నారని, అందుకే త్వరగా లేచారని ముఖేష్ గౌడ్ కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. వాళ్లు పొద్దునే లేవడానికి స్పష్టమైన కారణం చెప్పడం లేదని పోలీసులు అనుమానిస్తున్నారు.
ముందుగా తాను ఒక్కదాన్నే విక్రమ్‌ను దవాఖానకు తరలించానని అతని భార్య చెప్పినా, తరువాత డ్రైవర్ శ్రీకాంత్ తో వెళ్లినట్లు వెల్లడయ్యింది. ఎవరికి వారే జరిగిన సంఘటనలపై విరుద్ధంగా చెబుతున్న విషయంపై పోలీసులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంత ఉదయమే నిద్రలేచిన విషయం ఎవరికి తెలుస్తుంది, స్నానం చేసి విక్రమ్ గౌడ్ కిందకు రాగానే కాల్పులు జరిపి అగంతకుడు ఎలా పరారయ్యాడు? విక్రమ్ గౌడ్ కిందకు వచ్చిన తరువాత నిమిషం వ్యవధిలోనే అతని భార్య కిందకు వస్తున్నాడని చెప్పింది, అంత సమయంలో ఏమి జరిగి ఉంటుందని స్పష్టత రావాల్సి ఉంది. ఘటన జరిగిన తరువాత వాచ్ మెన్ తో ఘటన స్థలంలో రక్తపు మరకలు తూడ్చివేయించారు. అలా ఎందుకు చేశారనేదానిపై కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అగంతకుడు వచ్చాడా? ఒక పథకం ప్రకారమే ఎవరినైనా రప్పించారా? తనంతట తానుగా గన్ తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నం చేశాడా? అనే విషయాల్లో స్పష్టత కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, విక్రమ్ గౌడ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో అతని తండ్రి ముఖేష్ మంత్రిగా కొనసాగిన సమయంలో విక్రమ్ గౌడ్ తన హావాను కొనసాగించాడు. రియల్ ఎస్టేట్ - సినీ పరిశ్రమలో కొన్నాళ్లు చక్రం తిప్పాడు. నిర్మాతగా రెండు సినిమాలు తీశాడు. ఈ సినిమాలు బాగానే నడిచాయి. గత ఏడాది జరిగిన జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మేయర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. కొన్ని పబ్బుల్లోను పెట్టుబడులు ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో తన వ్యాపారంలో వచ్చి న నష్టాలతో ఆర్ధికంగా ఇబ్బందుల్లోకి విక్రమ్ గౌడ్ జారుకున్నాడని సమాచారం. ఈ విషయంలోనే తరచూ కుటుంబ సభ్యులతో గొడవ జరుగుండేదని తెలిసింది. ఆర్ధిక సమస్యల నుంచి బయటపడేందుకు అప్పులు తేవడంతో అవన్నీ తలకు మించిన భారంగా తయారయ్యాయని సమాచారం. తాను పెట్టుబడి పెట్టిన పబ్బు పేరు కూడా డ్రగ్స్ విషయంలో ఇటీవల బయటకు వచ్చినట్లు తెలిసింది. దీని విషయంలోను ఇటీవల గొడవలు జరిగినట్లు సమాచారం. వీటన్నింటి నుంచి బయట పడాలంటే ఏదో ఒకటి చేయాలని ఒక ప్లాన్ ప్రకారం కాల్పుల ఘటనకు తెరలేపి ఉంటారనే పుకార్లు సాగుతున్నాయి.
ఇదిలాఉండగా.. విక్రమ్‌గౌడ్ వివిధ వ్యాపారాలు నిర్వహించాడు. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోకి వెళ్లి ఒక న్యూస్ ఛానల్ కూడా పెట్టాలనే ఆలోచన చేసినట్లు తెలిసింది. మినిస్ట్రీస్ ఆప్ కంపెనీ ఎఫయిర్స్ ఆన్ రికార్డుల ప్రకారం శ్రేష్ట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రేష్ట్ ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ - శ్రేష్ట్ ఇన్ ఫ్రాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ - శ్రేష్ట్ హోటల్స్ అండ్ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ లో విక్రమ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలోనే రిజిస్ట్రేషన్ అయినట్లు తెలిసింది. మీడియాలోకి ఎంట్రీకి ముందే ఇలా జరగడం గమనార్హం.